Kadapa: బ్రహ్మంగారిమఠం దేవస్థానంలో అవినీతి..ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీపై చర్యలు తీసుకోవాలి!

Kadapa: బ్రహ్మంగారిమఠం దేవస్థానంలో ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ భారీ అవినీతికి పాల్పడ్డారని రాష్ట్ర దేవాలయాల సంరక్షణ సమితి అధ్యక్షుడు కుప్పాల శ్రీనాథరెడ్డి ఆరోపణ.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 19 Sept 2026 6:22 PM IST
Kadapa
X

Kadapa: బ్రహ్మంగారిమఠం దేవస్థానంలో అవినీతి..ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీపై చర్యలు తీసుకోవాలి!

Kadapa: బ్రహ్మంగారిమఠం దేవస్థానంలో పూర్వపు పీఠాధిపతి మరణానంతరం నిర్వహణ కోసం వచ్చిన ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ భారీ అవినీతి,అక్రమాలకు పాల్పడ్డారని రాష్ట్ర దేవాలయాల సంరక్షణ సమితి అధ్యక్షుడు కుప్పాల శ్రీనాథ్ రెడ్డి ఆరోపించారు.శనివారం ఆయన బ్రహ్మంగారిమఠంలో విలేఖరులతో మాట్లాడుతూ..

మఠంలోని ఆదాయం,ఆదాయ వనరులు,అలాగే సీజీఎఫ్ నిధుల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆయన విమర్శించారు.ఈ అక్రమాలపై మంత్రి దృష్టికి,సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పుడు విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని,అయితే ఏళ్లు గడుస్తున్నా విచారణ పేరుతోనే కాలయాపన చేస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

భక్తుల కానుకలతో నడిచే దేవాలయంలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు వస్తే వెంటనే విచారించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత దేవదాయ శాఖపై ఉందని,కానీ ఇక్కడ అలాంటి ప్రయత్నమే జరగడం లేదని అన్నారు. "మేము,మా సిబ్బంది ఏమైనా చేస్తాము,మాపై ఎలాంటి చర్యలు ఉండవు" అన్నట్లుగా ఎండోమెంట్ అధికారుల తీరు ఉందని ఆరోపించారు.

భక్తులు సమర్పించిన నిధులకే రక్షణ లేకపోతే భక్తులు ఇక కానుకలు ఎలా వేస్తారని ఆయన ప్రశ్నించారు.శంకర్ బాలాజీపై అనేక చోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయని,రుజువులతో సహా చూపించినా జిల్లా కలెక్టర్ సైతం చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటని నిలదీశారు. దీంతో భక్తులు ప్రభుత్వ యంత్రాంగంపైనే నమ్మకం కోల్పోతున్నారన్నారు.

ఒక్క ఫిట్ పర్సన్ కోసం ఎండోమెంట్ శాఖకు చెడ్డ పేరు వస్తున్నా అతన్ని వెనకేసుకురావడం దౌర్భాగ్యమని అన్నారు.

కడపలో ఏసీ కార్యాలయం ఏర్పాటు కోసం మఠం నిధుల నుంచి దాదాపు రూ.5 లక్షలు తీసుకెళ్లడంపై,అలాగే ధ్వజస్తంభం చుట్టూ నిర్మాణం కోసం ఓ భక్తుడు సమర్పించిన రూ.1.50 లక్షలను,పోలేరమ్మ నూతన విగ్రహం కోసం కందిమల్లాయపల్లె గ్రామ ప్రజలు విరాళంగా ఇచ్చిన రూ.60 వేలను కూడా సొంత ఖాతాలో జమ చేసుకోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

అలాగే పోలేరమ్మ తల్లి గుడిలో రెండుసార్లు హుండీల దొంగతనం జరిగితే ఇంతవరకు అతి గతి లేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.చివరికి దేవాలయాల పరిస్థితి ఏమవుతుందోనని ఆయన ఆందోళన చెందారు.

ఇది దేవాలయాల పేరుతో దోపిడీకి పరాకాష్ట అని,భక్తుల సొమ్మును రక్షించడంలో దేవదాయ శాఖ 10 శాతం కూడా బాధ్యత నిర్వర్తించలేదనడానికి ఇదే నిదర్శనమని విమర్శించారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే శంకర్ బాలాజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు చంద్ర ఓబుల్ రెడ్డి,బీజేపీ ఓబీసీ మండల మోర్చా అధ్యక్షుడు సారే రామానాయుడు,జిల్లా బిజెపి ఓబీసీ కార్యవర్గ సభ్యులు చంద్రకాంతం ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR