Uppal: గోవా నుంచి డ్రగ్స్ సరఫరా: ఉప్పల్‌లో నలుగురు అరెస్ట్!

Uppal: గోవా నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ తరలిస్తున్న నలుగురు యువకులను మల్కాజిగిరి ఎస్‌ఓటీ, పోచారం పోలీసులు పట్టుకున్నారు. ఎర్టిగా కారు, ఫోన్లను సీజ్ చేసి రిమాండ్‌కు తరలించారు.

KARUNAKAR, UPPAL
Published on: 3 Nov 2026 11:28 PM IST
Uppal
X

Uppal: గోవా నుంచి డ్రగ్స్ సరఫరా: ఉప్పల్‌లో నలుగురు అరెస్ట్!

ఉప్పల్: గోవా నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని తరలిస్తున్న నలుగురిని మల్కాజిగిరి ఎస్‌ఓటీ, పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అన్నోజిగూడ సమీపంలో జాతీయ రహదారి 163పై మంగళవారం మధ్యాహ్నం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న ఎర్టిగా కారును ఆపి తనిఖీ చేయగా ఎండీఎంఏ మత్తు పదార్థం పట్టుబడింది. దీంతో కారులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోచారం ఇన్‌స్పెక్టర్‌ జగన్నాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు గోవా నుంచి ఎండీఎంఏ పొడిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు.

ఈ మత్తు పదార్థాన్ని వినియోగించడంతో పాటు విక్రయించేందుకు తీసుకొస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వారి నుంచి 32 మిల్లీగ్రాముల ఎండీఎంఏ పొడి, నాలుగు సెల్‌ఫోన్లు, రవాణాకు ఉపయోగించిన మెరూన్‌ రంగు ఎర్టిగా కారును స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన వారిలో ఉప్పల్‌ వినాయకనగర్‌కు చెందిన కొమ్ము ప్రశాంత్‌ (28), చిల్కానగర్‌కు చెందిన భూర్క ప్రవీణ్‌కుమార్‌ (27), ఉప్పల్‌ భారత్‌నగర్‌కు చెందిన గడ్డాల తరుణ్‌ (26), పెదొళ్ల ప్రవీణ్‌ (25) ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ జగన్నాథ్‌ తెలిపారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL