Donald Trump: ట్రంప్‌ నివాసం వద్ద హైఅలర్ట్.. కారుతో దూసుకొచ్చిన వ్యక్తి, బారికేడ్ దాటిన మరో వ్యక్తి

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ సమీపంలో నవంబర్ 9న రెండు భద్రతా ఘటనలు కలకలం రేపాయి. ఒక కారు లెఫాయెట్ పార్క్ వద్ద ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లగా, మరో వ్యక్తి బారికేడ్ దాటేందుకు ప్రయత్నించాడు.

CR Reddy
Published on: 10 Nov 2026 7:05 AM IST
Donald Trump: ట్రంప్‌ నివాసం వద్ద హైఅలర్ట్.. కారుతో దూసుకొచ్చిన వ్యక్తి, బారికేడ్ దాటిన మరో వ్యక్తి
X

Donald Trump: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ సమీపంలో సోమవారం ఉదయం అనూహ్య ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక కారు సైన్‌బోర్డును ఢీకొనగా.. మరో వ్యక్తి అధ్యక్ష భవనం ఎదురుగా ఉన్న పార్క్‌ వద్ద భద్రతా బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించాడు. ఈ రెండు ఘటనలతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. వైట్‌హౌస్‌ పరిసరాల్లో తాత్కాలిక ఆంక్షలు విధించి, భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘటనలు జరిగిన సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌లోనే ఉన్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆయనకు ఎలాంటి ముప్పు ఎదురైందనే సమాచారం లేదు.

లెఫాయెట్ స్క్వేర్‌లోకి దూసుకెళ్లిన కారు

అమెరికా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ముందు ఈ ఘటన జరిగింది. వెండి రంగులో ఉన్న సెడాన్ కారు లెఫాయెట్ పార్క్ ఉత్తర భాగంలోని 16వ వీధి, హెచ్ స్ట్రీట్ సమీపంలో ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లి అక్కడి సైన్‌బోర్డును ఢీకొట్టింది. కారు నుంచి పొగ రావడంతో అక్కడున్న సీక్రెట్ సర్వీస్ అధికారులు, నేషనల్ గార్డ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. డ్రైవర్‌ను కారు నుంచి బయటకు రావాలని ఆదేశించారు. అయితే అతడు బయటకు వచ్చిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించడమే కాకుండా భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి, ఘర్షణకు దిగినట్లు అధికారులు తెలిపారు. చివరకు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

రెండో ఘటనలో బారికేడ్ దాటిన మరో వ్యక్తి

కారు ప్రమాదం జరిగిన సమయంలోనే లెఫాయెట్ పార్క్ వాయవ్య మూలలో మరో వ్యక్తి భద్రతా బారికేడ్‌ను దాటి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది వెంటనే అతడిని కూడా పట్టుకున్నారు. ఇలా రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ వెల్లడించింది. ఈ పరిణామాలతో వైట్‌హౌస్‌ను కొద్దిసేపు లాక్‌డౌన్‌లో ఉంచారు. చుట్టుపక్కల రహదారులను మూసివేసి తనిఖీలు చేపట్టారు. కారులో పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానంతో వాషింగ్టన్ పోలీసుల బాంబు నిర్వీర్య బృందం కూడా తనిఖీ చేసింది.

ప్రమాదమా? కుట్రనా?

ఈ రెండు ఘటనలు ప్రమాదవశాత్తు జరిగాయా? లేక కావాలనే భద్రతా వలయాన్ని ఛేదించేందుకు ప్రయత్నించారా? అనే విషయంపై ప్రస్తుతం స్పష్టత లేదు. రెండు ఘటనల మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు వాటి వెనుక ఉద్దేశం ఏమిటన్నది వెల్లడించలేదు. డ్రైవర్లు లేదా మరో వ్యక్తి లక్ష్యం అధ్యక్షుడు ట్రంప్‌నే అని చెప్పడానికి కూడా అధికారిక ఆధారాలు లేవు. సీక్రెట్ సర్వీస్ రెండు ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రకటించింది.

ఘటన సమయంలో వైట్‌హౌస్‌లోనే ట్రంప్

ఈ ఘటనలు జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వైట్‌హౌస్‌లో ఉన్న మీడియా ప్రతినిధులను కూడా కొద్దిసేపు వెస్ట్ వింగ్‌లోని బ్రీఫింగ్ గదిలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. తనిఖీలు పూర్తయ్యాక ఆంక్షలను క్రమంగా ఎత్తివేశారు. ఈ ఘటనల్లో ఎవరికైనా గాయాలయ్యాయనే సమాచారం ప్రాథమిక నివేదికల్లో లేదు. అయితే అధ్యక్షుడి నివాసానికి అత్యంత సమీపంలో కొద్ది వ్యవధిలోనే రెండు భద్రతా ఉల్లంఘనలు జరగడం అమెరికా భద్రతా విభాగాల్లో కలకలం రేపింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.