US Tariff: రష్యా చమురుపై అమెరికా కత్తి.. భారత్‌కు పెను ముప్పు!

US Tariff: రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ప్రవేశపెట్టిన టారిఫ్ బిల్లు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపనుంది?

Arun Chilukuri
Published on: 17 Sept 2026 11:00 AM IST
US Tariff
X

US Tariff: రష్యా చమురుపై అమెరికా కత్తి.. భారత్‌కు పెను ముప్పు!

US Tariff: అంతర్జాతీయ రాజకీయాల్లో చోటుచేసుకున్న కీలక పరిణామం భారత్ ఇంధన రంగాన్ని సంకటంలోకి నెట్టింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి కట్టబెట్టే బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. ప్రస్తుతం ఈ బిల్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కోసం సిద్ధంగా ఉంది. ఈ పరిణామం రష్యా నుంచి భారీగా ముడిచమురును దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత, అనగా 2022 నుంచి భారత్‌కు రష్యా అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించింది. అధికారిక గణాంకాల ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో భారత్ సుమారు 40.8 బిలియన్ డాలర్ల విలువైన రష్యా ముడిచమురును దిగుమతి చేసుకుంది. ఇది దేశం మొత్తం చమురు దిగుమతుల్లో 30.3 శాతానికి సమానం. ఇక 2026 జులై నాటికి ఈ వాటా ఏకంగా 51 శాతానికి పెరిగింది. దేశీయ అవసరాల కోసం భారత్ 88 శాతానికి పైగా ముడిచమురును దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో, రష్యా నుంచి లభిస్తున్న చమురు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకంగా మారింది.

అమెరికా చట్టం కారణంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిచిపోతే, వెంటనే దేశీయంగా పెట్రోల్ బంకుల్లో ధరలు అకస్మాత్తుగా పెరుగుతాయని చెప్పలేం. భారతీయ రిఫైనరీలు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే అవకాశం ఉంది. అయితే, ఇక్కడే అసలు చిక్కు ముడిపడి ఉంది. రష్యా నుంచి లభిస్తున్న రాయితీలు ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రత్యామ్నాయ దేశాల నుంచి చమురు కొనుగోలు చేయాలంటే ఎక్కువ వెల చెల్లించాల్సి వస్తుంది. అంతేకాకుండా, ప్రపంచ మార్కెట్‌లోకి రష్యా చమురు రాక తగ్గితే, మొత్తం సరఫరా పడిపోయి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు అమాంతం పెరిగే ప్రమాదం ఉంది. ఇది భారత్‌పై పరోక్షంగా పెను భారాన్ని మోపుతుంది.

ఈ కొత్త అమెరికా చట్టం ప్రకారం టారిఫ్‌లు నేరుగా భారత్‌లో అమ్మే పెట్రోల్‌పై కాకుండా, అమెరికాకు భారత్ చేసే ఎగుమతులపై వర్తిస్తాయి. అంటే, భారత్ రష్యా నుంచి చమురు కొనసాగిస్తే అమెరికాతో వాణిజ్యపరమైన రిస్క్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ రష్యా నుంచి కొనుగోళ్లు ఆపేస్తే, అధిక ధరలకు ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేయాల్సి వచ్చి ఆర్థిక భారం పెరుగుతుంది. ఇలా భారత్ ప్రస్తుతం ఒక సంకట స్థితిలో చిక్కుకుంది.

భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను అంతర్జాతీయ ధరలు, పన్నులు, రవాణా ఛార్జీలు, డీలర్ కమీషన్ల ఆధారంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయిస్తాయి. గతంలో ధరలు గరిష్ట స్థాయికి చేరినప్పుడు, ప్రభుత్వం వినియోగదారులపై భారం తగ్గించడానికి ఎక్సైజ్ సుంకాలను సర్దుబాటు చేసింది. ప్రస్తుత పరిణామాలపై తుది నిర్ణయం మాత్రం అంతర్జాతీయ ముడిచమురు ధరలు, ప్రత్యామ్నాయ సరఫరాల ఖర్చు, రూపాయి-డాలర్ మారకం విలువ, రిఫైనరీ మార్జిన్లు, ప్రభుత్వ విధానాలపైనే ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల పెట్రోల్ ధర ఎంత మేర పెరుగుతుందనే దానిపై ఇప్పుడే కచ్చితమైన అంచనాకు రావడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.