Train Crash: ఘోర రైలు ప్రమాదం.. రెండు హై-స్పీడ్ రైళ్లు ఢీకొని 50 మంది మృతి

Train Crash: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు హై-స్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 50 మంది మృతి చెందగా, 200 మందికి పైగా గాయపడ్డారు.

CR Reddy
Published on: 29 Oct 2026 6:55 AM IST
Spain Train Crash
X

Spain Train Crash

Train Crash: స్పానిష్ రైల్వే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెను విషాదం చోటుచేసుకుంది. స్పెయిన్ దేశంలో రెండు హై-స్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటనలో సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. రాజధాని మాడ్రిడ్‌ను దక్షిణ అండలూసియా ప్రాంతంతో అనుసంధానించే ప్రధాన రైల్వే మార్గంలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం పూట జరిగిన ఈ ఘటనతో రైళ్లలోని బోగీలు నుజ్జునుజ్జయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద తీవ్రతకు సహాయక చర్యలు ముమ్మరం చేసినప్పటికీ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

సిగ్నల్ వ్యవస్థ లోపమే కారణమా?

ఈ ఘోర రైలు ప్రమాదానికి సిగ్నల్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక లోపమే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. మోరా, ఓర్గాజ్, ఉర్డా పట్టణాల మధ్య ఒకే ట్రాక్‌పై నిలిచివున్న ఇరియో రైలును ఏవీఈ హై-స్పీడ్ రైలు వెనుక నుంచి వచ్చి వేగంగా ఢీకొట్టింది. ట్రాక్ సిగ్నలింగ్ సమస్యను ఒక టెక్నీషియన్ సరిచేస్తున్న సమయంలో ఈ పొరపాటు జరిగినట్లు తెలుస్తోంది. ముందు భాగంలో రైలు ఆగివున్న విషయం గురించి ఏవీఈ రైలు సిబ్బందికి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతోనే ఈ పెను ప్రమాదం జరిగిందని నిపుణులు భావిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత అసలు నిజాలు బయటికి రానున్నాయి.

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు

ప్రమాద వార్త తెలిసిన వెంటనే స్పెయిన్ ప్రభుత్వం అప్రమత్తమై రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేసింది. సివిల్ గార్డ్ దళాలు, ప్రత్యేక భద్రతా బృందాలు, ఎయిర్ యూనిట్లు, డ్రోన్ టీమ్స్, పోలీస్ జాగిలాలతో పాటు అత్యవసర వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి. ఈ దుర్ఘటన కారణంగా మాడ్రిడ్ - అండలూసియా రూట్లో రైలు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. కార్డోబా సహా పలు ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కడికక్కడ నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికుల రాకపోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే పనిలో రైల్వే అధికారులు నిమగ్నమయ్యారు.

నిరసన ప్రదర్శనలు వాయిదా

దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ రైలు ప్రమాద బాధితుల పట్ల సంఘీభావంగా స్పెయిన్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని మాడ్రిడ్‌లో ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరగవలసిన భారీ ట్రాక్టర్ ప్రదర్శనను నిరసనకారులు పూర్తిగా వాయిదా వేశారు. మృతి చెందిన వారి పట్ల గౌరవసూచకంగా ఆందోళన కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. మరోవైపు స్పెయిన్ ప్రధాని ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.