Trump Netanyahu Iran Dispute: ట్రంప్‌, నెతన్యాహు మధ్య ఇరాన్‌ చిచ్చు...తీవ్రస్థాయిలో విబేధాలు

ఇరాన్‌పై మళ్లీ సైనిక దాడులు చేయాలా? దౌత్య చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలా? అనే అంశంపై ట్రంప్‌, నెతన్యాహు మధ్య విభేదాలు వచ్చినట్లు అంతర్జాతీయ కథనం వెల్లడించింది. అయితే తీవ్ర వాగ్వాదం జరిగిందన్న వార్తలను నెతన్యాహు కార్యాలయం ఖండించింది.

Rudrachander
Published on: 13 Nov 2026 5:18 PM IST
Trump Netanyahu Iran Dispute: ట్రంప్‌, నెతన్యాహు మధ్య ఇరాన్‌ చిచ్చు...తీవ్రస్థాయిలో విబేధాలు
X

Trump Netanyahu Iran Dispute: ఇరాన్‌పై మరోసారి సైనిక చర్యకు దిగాలా? లేక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలా? ఈ ఒక్క అంశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య విభేదాలకు కారణమైనట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరాన్‌పై తదుపరి కార్యాచరణ విషయంలో ఇద్దరు నేతల అభిప్రాయాలు భిన్నంగా ఉండటంతో ఫోన్ సంభాషణ తీవ్ర వాగ్వాదంగా మారిందని ఇజ్రాయెల్‌కు చెందిన 'యెత్ న్యూస్' (Ynet) కథనం వెల్లడించింది. ఈ సంభాషణను ఒకరు 'నరకప్రాయమైన అరుపుల యుద్ధం'గా అభివర్ణించినట్లు పేర్కొంది. అయితే ఈ వార్తలను నెతన్యాహు కార్యాలయం ఖండించింది.

దాడులు చేయాలన్న నెతన్యాహు.. చర్చలకే ట్రంప్ మొగ్గు?

యెత్ న్యూస్ కథనం ప్రకారం.. ఇరాన్‌పై మళ్లీ సైనిక దాడులు ప్రారంభించాలని నెతన్యాహు పట్టుబట్టినట్లు సమాచారం. మరోవైపు ట్రంప్ మాత్రం తక్షణ సైనిక చర్యకు బదులుగా దౌత్యపరమైన ప్రయత్నాలకు అవకాశం ఇవ్వాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఫోన్ కాల్‌లో వాతావరణం వేడెక్కిందని పేర్లు వెల్లడించని వర్గాలను ఉటంకిస్తూ కథనం పేర్కొంది. అమెరికాలో ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ ఎదుర్కొన్న భారీ ఓటమి కూడా ఈ పరిణామాలకు నేపథ్యంగా ప్రస్తావనకు వచ్చింది. ఇరాన్‌తో కొనసాగుతున్న ఘర్షణ ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడిందనే విమర్శలు పార్టీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారాయి. ఈ పరిస్థితుల్లో మరోసారి యుద్ధాన్ని విస్తరించడం ట్రంప్‌కు రాజకీయంగా సవాలుగా మారే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ నుంచి హెచ్చరికలు రావడం ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. అవసరమైతే మధ్యప్రాచ్య ప్రాంతానికే పరిమితం కాకుండా, అమెరికాకు మద్దతుగా నిలిచే ఇతర దేశాలపైనా ఘర్షణ ప్రభావం చూపవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి.

వార్తలను ఖండించిన నెతన్యాహు కార్యాలయం

ట్రంప్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుందన్న కథనాన్ని నెతన్యాహు కార్యాలయం తోసిపుచ్చింది. ఈ వార్త పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని యెత్ న్యూస్‌కు తెలిపింది. అయితే ఇద్దరు నేతల మధ్య ఫోన్ సంభాషణ జరిగిన విషయాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి ధ్రువీకరించారు. కానీ అది కష్టతరమైన లేదా ఉద్రిక్తమైన సంభాషణ కాదని ఆయన చెప్పినట్లు కథనం పేర్కొంది. దీంతో అసలు ఫోన్ కాల్‌లో ఏం జరిగిందనే అంశంపై భిన్నమైన వాదనలు తెరపైకి వచ్చాయి.

గతంలోనూ ఇద్దరి మధ్య విభేదాలు

ట్రంప్‌, నెతన్యాహు మధ్య అభిప్రాయభేదాలు బయటపడటం ఇదే మొదటిసారి కాదు. గత జూన్‌లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగించడంపై నెతన్యాహుతో తాను గట్టిగా మాట్లాడినట్లు ట్రంప్ స్వయంగా అంగీకరించారు. మిరాండా డివైన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. లెబనాన్‌తో నిరంతరం పోరాటం కొనసాగించడంపై తాను అసహనం వ్యక్తం చేశానని, దాడులు ఆపాలని నెతన్యాహుకు స్పష్టంగా చెప్పానని వివరించారు. అయితే ఈ వాగ్వాదం ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగానే ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.

Rudrachander

Rudrachander

రుద్ర చందర్‌ తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు