South China Sea Dispute: ఆసియాన్ వేదికగా చైనాకు అడ్డకట్ట వేసేందుకు భారత్ వ్యూహం
దక్షిణ చైనా సముద్ర వివాదంపై ఆసియాన్ సదస్సు 2026లో కీలక చర్చలు జరుగుతున్నాయి. చైనా ఆధిపత్యానికి భారత్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తోంది? భారత వైఖరి, వాణిజ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
South China Sea Dispute: దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్యం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలు ఆసియా దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిలిప్పీన్స్ రాజధాని మెట్రో మనీలాలో జరుగుతున్న 49వ ఆసియాన్ సదస్సులో ఈ వివాదం ప్రధాన చర్చాంశంగా మారింది. సముద్ర జలాలపై హక్కులు, అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకాలు లేకుండా నౌకల రాకపోకలు, ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై సభ్య దేశాలు దృష్టి సారించాయి. ఈ పరిణామాలను భారత్ కూడా నిశితంగా గమనిస్తోంది. చైనాతో నేరుగా ఘర్షణ పడకుండా, అంతర్జాతీయ చట్టాలను అమలు చేయాలనే అంశాన్ని బలంగా వినిపించడం ద్వారా సముద్ర ప్రాంతంలో సమతుల్యతను కాపాడాలన్నది న్యూఢిల్లీ వ్యూహంగా కనిపిస్తోంది.
దక్షిణ చైనా సముద్రంపై వివాదం ఎందుకు?
దక్షిణ చైనా సముద్రం ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన జలమార్గం. ప్రపంచ సముద్ర రవాణాలో దాదాపు మూడో వంతు ఈ ప్రాంతం గుండానే సాగుతుంది. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాలను కలిపే ఈ మార్గంపై పట్టు సాధించడం వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. చైనా ఈ సముద్రంలోని దాదాపు మొత్తం ప్రాంతంపై తనకు హక్కులున్నాయని చెబుతోంది. ఇందుకోసం తొమ్మిది గీతల సరిహద్దు (Nine-Dash Line) వాదనను ముందుకు తెస్తోంది. అయితే వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై, ఇండోనేషియా దేశాల సముద్ర ఆర్థిక హక్కులు కూడా చైనా వాదనతో కొన్ని ప్రాంతాల్లో కలుస్తున్నాయి. ముఖ్యంగా చేపల వేట, చమురు, సహజవాయువు నిక్షేపాల అన్వేషణ విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి. హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ నౌకాయానానికి దక్షిణ చైనా సముద్రం మరింత కీలకంగా మారింది.
భారత్ వైఖరిలో మూడు కీలక అంశాలు
భారత్ ఈ వివాదంలో ఒక స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తోంది. సముద్ర మార్గాలపై అన్ని దేశాలకు స్వేచ్ఛ ఉండాలని, అంతర్జాతీయ చట్టాల ప్రకారమే హక్కులను నిర్ణయించాలని న్యూఢిల్లీ కోరుతోంది. భారత విదేశాంగ విధానంలోని యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండో-పసిఫిక్ వ్యూహాలకు ఈ ప్రాంతం ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది. భారత్ సముద్ర వాణిజ్యంలో దాదాపు 50 నుంచి 55 శాతం వరకు దక్షిణ చైనా సముద్రం, మలక్కా జలసంధి మార్గాలపై ఆధారపడి ఉంది. అందువల్ల అక్కడ ఉద్రిక్తతలు పెరిగితే భారత వాణిజ్యం, ఇంధన సరఫరాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్ ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావిస్తోంది. మొదటిది.. దక్షిణ చైనా సముద్రంలో నౌకలు, విమానాల రాకపోకలకు ఎలాంటి ఆంక్షలు ఉండకూడదు. రెండోది.. సముద్రంపై హక్కుల విషయంలో ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాలనే (UNCLOS) ప్రాతిపదికగా తీసుకోవాలి. మూడోది.. చైనా, ఆసియాన్ దేశాల మధ్య కుదిరే ఒప్పందం చర్చల్లో నేరుగా పాల్గొనని ఇతర దేశాల హక్కులకు భంగం కలిగించకూడదు. ఈ విషయాలను భారత ప్రతినిధులు పలు అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికే స్పష్టం చేశారు.
2016 తీర్పునకు భారత్ మద్దతు
దక్షిణ చైనా సముద్ర వివాదంలో 2016లో వచ్చిన అంతర్జాతీయ న్యాయస్థాన తీర్పు కీలకమైనది. ఫిలిప్పీన్స్ దాఖలు చేసిన కేసును విచారించిన హేగ్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్.. చైనా ప్రతిపాదించిన విస్తృత సముద్ర హక్కులకు అంతర్జాతీయ సముద్ర చట్టం కింద చట్టబద్ధమైన ఆధారం లేదని తీర్పునిచ్చింది. ఫిలిప్పీన్స్ ప్రత్యేక ఆర్థిక మండలిలో చైనా జోక్యం చేసుకోవడాన్ని కూడా తప్పుబట్టింది. అయితే చైనా ఈ తీర్పును అంగీకరించలేదు. ఈ విషయంలో భారత్ ఫిలిప్పీన్స్‌కు మద్దతుగా నిలిచింది. 2023లో కూడా 2016 తీర్పును పూర్తిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలతో సంయుక్త నౌకాదళ విన్యాసాలు నిర్వహిస్తూ సముద్ర భద్రతకు సహకరిస్తోంది. చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఓఎన్‌జీసీ విదేశ్ ద్వారా ఈ ప్రాంతంలో చమురు, సహజవాయువు అన్వేషణ కార్యకలాపాల్లోనూ భారత్ ఆసక్తి చూపుతోంది.
80 శాతం ఒప్పంద ముసాయిదా సిద్ధం.. అయినా మిగిలిన చిక్కులేంటి?
ఆసియాన్ సదస్సు తొలిరోజు చైనా, సభ్య దేశాల మధ్య దక్షిణ చైనా సముద్ర ప్రవర్తనా నియమావళి (Code of Conduct)పై చర్చలు జరిగాయి. ఒప్పంద ముసాయిదాలో సుమారు 80 శాతం అంశాలపై ప్రాథమిక అవగాహనకు వచ్చినప్పటికీ, మిగిలిన కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ముఖ్యంగా ఈ ఒప్పందం చట్టబద్ధంగా అమలు చేయాల్సినదిగా ఉండాలా? లేదా? అనే ప్రశ్న ఇంకా పరిష్కారం కాలేదు. ఫిలిప్పీన్స్ అధ్యక్షత ముగిసేలోగా ఒప్పందాన్ని పూర్తి చేయడం సాధ్యం కాదని ఆ దేశ విదేశాంగ మంత్రి వెల్లడించారు. తదుపరి ఏడాది సింగపూర్ ఆసియాన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ చర్చలు కొనసాగనున్నాయి. మొత్తంగా చూసుకుంటే... దక్షిణ చైనా సముద్ర వివాదం కేవలం చైనా, ఫిలిప్పీన్స్ మధ్య భూభాగాల సమస్య మాత్రమే కాదు. ప్రపంచ వాణిజ్యం, ఇంధన రవాణా, ఆసియా దేశాల భద్రతతో ముడిపడిన అంశం. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ చట్టాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న భారత్ వైఖరి, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో దాని వ్యూహాత్మక ప్రయోజనాలకు కీలకంగా మారుతోంది.




