Satellite Killers: భయపెడుతున్న శాటిలైట్ కిల్లర్స్... ప్రపంచ కమ్యూనికేషన్ కుప్పకూలుతుందా?
ఇప్పటి వరకు భూమిపై మాత్రమే యుద్ధాలు జరగ్గా...రాబోయే రోజుల్లో అంతరిక్షంలో కూడా యుద్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కీలకమైన శాటిలైట్స్‌ను కూల్చే కిల్లర్ ఆయుధాలను ప్రపంచదేశాలు అభివృద్ధి చేస్తున్నాయి.
Satellite Killers: అంతరిక్షంలో ఊపందుకుంటున్న 'శాటిలైట్ కిల్లర్' దాడులు... ప్రమాదంలో ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలు. రష్యా, చైనాల రహస్య అంతరిక్ష సైనిక విన్యాసాలు... 626 బిలియన్ డాలర్ల స్సేస్ ఎకానమీకి పొంచివున్న భారీ ముప్పు? ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి ముందే శాటిలైట్లపై సైబర్ దాడి... వ్యూహాత్మకంగా మారుతున్న ఆధునిక అంతరిక్ష యుద్ధ తంత్రం.
ఆధునిక ప్రపంచంలో మనం ఉపయోగిస్తున్న ఇంటర్నెట్, జీపీఎస్, రక్షణ రంగ సమాచార వ్యవస్థలన్నీ భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే 21వ శతాబ్దంలో అంతరిక్షం ఇక ఎంతమాత్రం సురక్షితమైన ప్రదేశం కాదని పదేపదే నిరూపితమవుతోంది. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభించడానికి కొద్ది గంటల ముందే, ఉక్రెయిన్‌తో పాటు మధ్య యూరప్‌లోని వేలాది ఉపగ్రహ మోడెమ్‌లను సైబర్ దాడి ద్వారా రష్యా నిష్క్రియం చేసింది. సైనిక దళాల సమాచార వ్యవస్థను దెబ్బతీయడానికే ఈ దాడులు జరిగాయని అమెరికాలోని ఏరోస్పేస్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ నిపుణులు వెల్లడించారు.
626 బిలియన్ డాలర్ల స్పేస్ ఎకానమీకి ప్రమాదం
కోల్డ్‌వార్ నాటి నుంచి రష్యా, అమెరికాలు అంతరిక్షంలో ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నప్పటికీ, ఇటీవల కాలంలో ఈ ఉద్రిక్తతలు బహిరంగంగా వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 626 బిలియన్ డాలర్ల విలువైన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ తీవ్ర ముప్పులో పడింది. ఉక్రెయిన్ ఆక్రమణ తర్వాత రష్యాకు చెందిన Luch-1, Luch-2 అనే రెండు శాటిలైట్లు యూరప్‌కు చెందిన సమాచార ఉపగ్రహాలకు అత్యంత సమీపంలోకి వెళ్తూ అనుమానాస్పద విన్యాసాలు చేస్తున్నట్లు అంతరిక్ష పరిశోధకులు గుర్తించారు. అయితే, వ్యూహాత్మక సమాచార మార్పిడికి కీలకమైన 'ఇంటెల్‌శాట్ 39' వంటి నిలకడైన ఉపగ్రహాల డేటాను చోరీ చేయడం లేదా వాటిని తమ నియంత్రణలోకి తెచ్చుకోవడానికే రష్యా ఈ సైబర్, స్పేస్ డాగ్-ఫైటింగ్‌లకు పాల్పడుతోందని వెస్ట్రన్ డిఫెన్స్ నిపుణులు భావిస్తున్నారు.
స్పేస్ ఆయుధాలు ... కెస్లర్ సిండ్రోమ్ భయాలు
ఉపగ్రహాలను ధ్వంసం చేయడానికి లేదా వాటి సంకేతాలను నిర్వీర్యం చేయడానికి వివిధ దేశాలు రకరకాల ఆయుధాలను ఉపయోగిస్తున్నాయి. 2007లో చైనా గతంలో ప్రయోగించిన వాతావరణ ఉపగ్రహాన్ని క్షిపణితో పేల్చివేసి వేలాది వ్యర్థాలను అంతరిక్షంలోకి విడుదల చేసింది. 2008లో అమెరికా 'ఆపరేషన్ బర్న్ ఫ్రాస్ట్' ద్వారా, ఆ తర్వాత భారత్, రష్యాలు కూడా యాంటీ-శాటిలైట్ క్షిపణి సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. రష్యా అంతరిక్షంలో అణు సామర్థ్యం ఉన్న ఆయుధాలను ప్రతిపాదించే యోచనలో ఉందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. 1962లో అమెరికా చేసిన 'స్టార్‌ఫిష్ ప్రైమ్' అణు ప్రయోగం తీవ్రమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ ను సృష్టించి శాటిలైట్లను ధ్వంసం చేసింది. అయితే, ఇప్పుడు అంతరిక్షంలో క్షిపణి దాడుల వల్ల ఏర్పడే వ్యర్థాలు ఒకదానికొకటి వేగంగా ఢీకొని, స్పేస్‌లో ప్రయాణించే రాకెట్లను, శాటిలైట్‌లకు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. రాబోయే దశాబ్దాల పాటు మానవాళి అంతరిక్ష ప్రయాణాలను పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంటుందని స్పేస్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భవిష్యత్ రక్షణ ... బాడీగార్డ్ శాటిలైట్లు
ఈ ముప్పు నుంచి తమ కీలక ఉపగ్రహాలను కాపాడుకోవడానికి జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్ వంటి దేశాలు చిన్నతరహా 'గార్డియన్' లేదా 'బాడీగార్డ్' శాటిలైట్లను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ వంటి దేశాలు కూడా రేడియో సిగ్నళ్లను నిరోధించే ఎలక్ట్రానిక్ జామర్లను పెద్దమొత్తంలో రంగంలోకి దించుతుండటంతో, రాబోయే రోజుల్లో అంతరిక్ష యుద్ధ తంత్రం ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి.




