Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య డ్రోన్ యుద్ధం..10మంది మృతి.. 1,246 డ్రోన్లు కూల్చేశామన్న మాస్కో
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్ దాడులు మరింత తీవ్రంగా మారాయి. ఉక్రెయిన్‌లో రష్యా దాడుల్లో పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రంగా మారుతోంది. ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. శనివారం ఉక్రెయిన్‌లో జరిగిన రష్యా దాడుల్లో పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు తమ గగనతలంలోకి వచ్చిన 1,246 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఈ దాడులతో ఇరు దేశాల్లోని కీలక ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. ఉక్రెయిన్‌లోని ఉత్తర చెర్నిహివ్ ప్రాంతంలో ఉన్న నీజిన్ నగరంలోని ఓ సంస్థపై రష్యా డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు గాయపడ్డారు. రాజధాని కీవ్‌లో జరిగిన మరో దాడిలో ఓ మహిళ మృతి చెందింది. కనీసం నలుగురు గాయపడ్డారు. మరోవైపు రష్యా ఆధీనంలో ఉన్న జపోరిజ్జియా ప్రాంతంలో ఆస్పత్రికి చెందిన వాహనంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసిందని అక్కడి రష్యా అనుకూల అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఓ నర్సు, డ్రైవర్ చనిపోయారని, మరో ఇద్దరు గాయపడ్డారని వెల్లడించారు.
విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం?
ఉక్రెయిన్‌లోని విద్యుత్, ఇంధన వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు కొనసాగిస్తోంది. రాత్రి సమయంలో ప్రయోగించిన 162 రష్యా డ్రోన్లలో 141ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. కీవ్ సమీపంలోని బిలా త్సెర్క్వా నగరంలో జరిగిన దాడిలో ముగ్గురు గాయపడ్డారు. అక్కడి విద్యుత్ కేంద్రంతో పాటు కీవ్‌లోని ఓ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ కూడా వెల్లడించింది. దీంతో కీవ్‌లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయే అవకాశం ఉందని నగర మేయర్ విటాలి క్లిట్ష్కో హెచ్చరించారు. చలికాలం ప్రారంభానికి ముందే విద్యుత్ వ్యవస్థను దెబ్బతీసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.
1,246 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేశాం: రష్యా
మరోవైపు తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఒకే రాత్రిలో 1,246 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత నమోదైన అత్యధిక సంఖ్యల్లో ఇదొకటని పేర్కొంది. మాస్కో నగరం వైపు వస్తున్న 123 డ్రోన్లను ఎనిమిది గంటల్లో అడ్డుకున్నట్లు ఆ నగర మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం నుంచి మాస్కో ప్రాంతం వైపు మొత్తం 462 డ్రోన్లు వచ్చినట్లు చెప్పారు. అయితే ఎన్ని డ్రోన్లు ప్రయోగించారనే పూర్తి వివరాలను రష్యా వెల్లడించలేదు.
చమురు శుద్ధి కేంద్రాలు, పైప్‌లైన్లపైనా దాడులు?
రష్యాలోని రోస్తోవ్ ప్రాంతంలో 50కి పైగా డ్రోన్లను కూల్చివేసినట్లు అక్కడి గవర్నర్ తెలిపారు. ఈ ప్రాంతంలోని నోవోషాఖ్తిన్స్క్ చమురు శుద్ధి కేంద్రంపై కొన్ని డ్రోన్లు పడటంతో భారీ అగ్నిప్రమాదం జరిగిందని రష్యా, ఉక్రెయిన్‌కు చెందిన కొన్ని టెలిగ్రామ్ ఛానళ్లు పేర్కొన్నాయి. అయితే ఈ వార్తను స్వతంత్రంగా నిర్ధారించలేదు. సమారా ప్రాంతంలోని పారిశ్రామిక కేంద్రాలపై దాడులను అడ్డుకున్నట్లు రష్యా అధికారులు తెలిపారు. బ్రయాన్స్క్ ప్రాంతంలో ఓ కంపెనీ బస్సుపై డ్రోన్ పడటంతో తొమ్మిది మంది గాయపడ్డారు. రష్యాలోని చమురు రవాణా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడులు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో విద్యుత్ వ్యవస్థకు ముప్పు పెరుగుతోంది. ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతుండటంతో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే ప్రశ్నకు సమాధానం కనిపించడం లేదు.




