Russia Ukraine Satellite War: శాటిలైట్ సాక్షిగా...రష్యా, ఉక్రెయిన్ ఉపగ్రహ పోరు
రష్యా, ఉక్రెయిన్ మధ్య అంతరిక్ష పోటీ మొదలైంది. స్టార్‌లింక్‌పై ఆధారపడటం తగ్గించేందుకు ఉక్రెయిన్ సొంత ఉపగ్రహాలను అభివృద్ధి చేస్తుండగా, రష్యా 2035 నాటికి 900 శాటిలైట్లను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Russia Ukraine Satellite War: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇప్పుడు భూమి నుంచి అంతరిక్షం వరకు విస్తరిస్తోంది. ఇప్పటివరకు డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో పరస్పరం దాడులు చేసుకున్న ఇరు దేశాలు.. ఇప్పుడు సైనిక సమాచార వ్యవస్థల కోసం సొంత ఉపగ్రహ నెట్‌వర్క్‌లను నిర్మించుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌పై ఆధారపడటం ఉక్రెయిన్‌కు పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో కీవ్ సొంత శాటిలైట్ వ్యవస్థకు శ్రీకారం చుట్టగా, రష్యా కూడా 'రాస్‌వెట్' పేరుతో ఉపగ్రహ సమూహాన్ని సిద్ధం చేస్తోంది.
స్టార్‌లింక్‌పై ఆధారపడటం తగ్గించుకోవాలని ఉక్రెయిన్ ప్లాన్
ఉక్రెయిన్ సైన్యానికి యుద్ధ సమయంలో స్టార్‌లింక్ కీలక సమాచార సాధనంగా మారింది. సైనికులు, డ్రోన్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ కీలక విభాగాలు ఈ సేవల ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నాయి. అయితే ఈ వ్యవస్థపై పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరమని ఉక్రెయిన్ గుర్తించింది. స్టార్‌లింక్ సేవల్లో అంతరాయాలు ఏర్పడితే యుద్ధ రంగంలో సైనిక కార్యకలాపాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఉక్రెయిన్ కంపెనీ హిమెరా, డెన్మార్క్‌కు చెందిన గోమ్‌స్పేస్ కలిసి 'ఒబ్రియా నానో' అనే చిన్న ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపాయి. అక్టోబర్ 27న ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఉపగ్రహాలను ప్రయోగించి సొంత సైనిక సమాచార నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్నది ఉక్రెయిన్ లక్ష్యం. అంతేకాదు, ఫిన్లాండ్‌కు చెందిన నోకియా, ఐసీఐ సంస్థలతోనూ సైనిక ఉపగ్రహ వ్యవస్థల అభివృద్ధిపై చర్చలు ప్రారంభించింది.
రష్యా లక్ష్యం 2035 నాటికి 900 ఉపగ్రహాలు
మరోవైపు రష్యా కూడా 'రాస్‌వెట్' పేరుతో సొంత ఉపగ్రహ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. క్రెమ్లిన్ ఆధ్వర్యంలోని బ్యూరో 1440 సంస్థ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. 2035 నాటికి 900 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ప్రయత్నంలో రష్యాకు ఇప్పటివరకు కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రయోగించిన ఉపగ్రహాల్లో మూడో వంతుకు పైగా నిర్దేశిత కక్ష్యలో స్థిరపడటంలో విఫలమయ్యాయని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ గతంలో వెల్లడించింది. నవంబర్ ప్రారంభం నాటికి ప్రయోగించిన 32 రాస్‌వెట్-3 ఉపగ్రహాల్లో రెండు కోల్పోయినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
స్టార్‌లింక్‌కు ప్రత్యామ్నాయం అంత సులభం కాదు
ఉక్రెయిన్‌కు ఇరిడియం, వన్‌వెబ్ వంటి ఇతర ఉపగ్రహ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి సామర్థ్యం, ఖర్చు విషయంలో స్టార్‌లింక్‌తో పోలిస్తే పరిమితులున్నాయి. స్టార్‌లింక్ టెర్మినల్ ధర సుమారు 500 డాలర్ల వరకు ఉంటే, వన్‌వెబ్ పరికరం ధర 9,000 డాలర్ల వరకు ఉంటుందని అంచనా. పైగా ఉక్రెయిన్‌లో ఒక స్టార్‌లింక్ టెర్మినల్‌కు ఒకేసారి సుమారు 60 ఉపగ్రహాలు అందుబాటులో ఉండగా, వన్‌వెబ్‌కు సంబంధించినవి సగటున 11 మాత్రమే కనిపిస్తాయి. ఉక్రెయిన్ ముందు ఇప్పుడు రెండు మార్గాలున్నాయి. ఎక్కువ ఖర్చుతో పనిచేసే దీర్ఘకాలిక ఉపగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం లేదా తక్కువ ఖర్చుతో వందల సంఖ్యలో చిన్న ఉపగ్రహాలను ప్రయోగించడం. రెండో విధానంలో ఉపగ్రహాల జీవితకాలం తక్కువగా ఉండటంతో వాటిని తరచూ మార్చాల్సి ఉంటుంది. మరోవైపు ఉపగ్రహాలపై ఆధారపడకుండా కృత్రిమ మేధస్సుతో పనిచేసే డ్రోన్లు, స్ట్రాటోస్ఫియర్‌లో ఎగిరే డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధి కూడా ప్రత్యామ్నాయాలుగా పరిశీలనలో ఉన్నాయి.




