Russia War: యూరోపియన్ దేశాలకు పీడకలలా మారుతున్న రష్యా... పోలెండ్ సరిహద్దుల్లో భారీ దాడులు
ఉక్రెయిన్-పోలాండ్ సరిహద్దుకు 2 కిలోమీటర్ల దూరంలో రైలుపై రష్యా డ్రోన్ దాడి చేసింది. బోరిస్ జాన్సన్ సహా యూరోపియన్ నేతలు వెళ్లిన కొద్దిసేపటికే జరిగిన దాడిపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
Russia War: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఇప్పుడు యుద్ధభూమిని దాటి యూరప్ సరిహద్దుల వరకూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఉక్రెయిన్-పోలాండ్ సరిహద్దుకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న యహోదిన్ ప్రాంతంలో రష్యా డ్రోన్ ప్రయాణికుల రైలును ఢీకొట్టింది. రైలులోని ఇంజిన్‌ను డ్రోన్ తాకినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రయాణికులందరినీ అధికారులు ముందుగానే ఖాళీ చేయించారు. ఈ ఘటనకు మరింత ప్రాధాన్యం రావడానికి మరో కారణం ఉంది. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో పాటు పలువురు యూరోపియన్ భద్రతా అధికారులు అదే రైల్వే మార్గంలో కొద్దిసేపటి ముందే మరో రైలులో ప్రయాణించారు. కీవ్‌లో జరిగిన సమావేశానికి హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రిటన్ జాతీయ భద్రతా సలహాదారు జొనాథన్ పావెల్ కూడా ఆ బృందంలో ఉన్నారు.
లక్ష్యం రైలేనా?
రష్యా మాత్రం పశ్చిమ ఉక్రెయిన్‌లోని “రైల్వే మౌలిక వసతులపై” దాడి చేసినట్లు ప్రకటించింది. అయితే ఉక్రెయిన్ ప్రభుత్వ రైల్వే సంస్థ ఉక్ర్జలిజ్నిట్సియా మాత్రం ఈ డ్రోన్ దౌత్య ప్రతినిధులు ప్రయాణిస్తున్న రైలును లక్ష్యంగా చేసుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ఈ దాడి సాధారణ రైల్వే దాడేనా? లేక యూరోపియన్ ప్రతినిధుల కదలికలపై రష్యాకు ముందస్తు సమాచారం ఉందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. అదే సమయంలో యహోదిన్ స్టేషన్‌లో మరో రైలులో ఉన్న అమెరికా మాజీ సీఐఏ అధిపతి డేవిడ్ పెట్రాయస్ ఈ ఘటనను భయానకంగా అభివర్ణించారు. ఉక్రెయిన్‌లో సాధారణ పౌరులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న పరిస్థితికి ఇది మరో ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు.
15 నిమిషాల ముందు ఖాళీ
ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడానికి ప్రధాన కారణం ప్రయాణికులను ముందుగానే తరలించడమే. దాడికి కేవలం 15 నిమిషాల ముందు రైలులోని ప్రయాణికులను ఖాళీ చేయాలని ఆదేశించినట్లు ఉక్రెయిన్ రైల్వే సంస్థ వెల్లడించింది. రష్యా దాడుల ముప్పు కారణంగా రైలు నిర్ణీత సమయానికి భిన్నంగా ముందుగానే స్టేషన్ నుంచి బయలుదేరినట్లు కూడా తెలిపింది. ఉక్రెయిన్, పోలాండ్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం డ్రోన్ దాడి పోలాండ్ సరిహద్దుకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో జరిగింది. అంటే నాటో సభ్యదేశమైన పోలాండ్ సరిహద్దుకు రష్యా దాడులు మరింత చేరువవుతున్నాయన్న ఆందోళన సహజంగానే పెరిగింది. స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిల్ట్ కూడా అదే సమయంలో కీవ్ నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఆయన ప్రయాణిస్తున్న రైలును కొంతసేపు ఆపి, ప్రయాణికులను అత్యవసర తరలింపునకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు. పరిస్థితి అదుపులో ఉందని సమాచారం వచ్చిన తర్వాత ఆ రైలు పోలాండ్‌లోని డోరోహుస్క్ సరిహద్దు స్టేషన్‌కు సురక్షితంగా చేరింది.
పోలాండ్‌లో అత్యవసర సమావేశం
ఈ పరిణామంపై పోలాండ్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ప్రధాని డొనాల్డ్ టస్క్ అత్యవసర సమావేశం నిర్వహించారు. రష్యా చర్యలు క్రమంగా తమ సరిహద్దులకు దగ్గరవుతున్నాయని ఆయన హెచ్చరించారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రి సిబిహా కూడా రష్యా దాడులు యూరోపియన్ యూనియన్, నాటో తలుపుల వద్దకు చేరుతున్నాయని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ మాత్రం మరిన్ని వైమానిక రక్షణ వ్యవస్థలు, ముఖ్యంగా రష్యా వేగవంతమైన క్షిపణులు, జెట్ ఆధారిత డ్రోన్లను అడ్డుకునే ఇంటర్‌సెప్టర్లను అందించాలని మిత్రదేశాలను కోరుతోంది.
రైలు మార్గాలే ఎందుకు లక్ష్యం?
2022లో రష్యా పూర్తి స్థాయి దాడి ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్‌లో విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి. దీంతో రైల్వేలు దేశంలోనే అత్యంత కీలకమైన రవాణా వ్యవస్థగా మారాయి. లక్షలాది మంది ప్రజలు ప్రయాణించడంతో పాటు సైనిక సామగ్రి, అవసరమైన సరఫరాల తరలింపులోనూ రైలు మార్గాలే ప్రధాన ఆధారం. ఇటీవలి కాలంలో రష్యా రైల్వే స్టేషన్లు, డిపోలు, సరిహద్దు ప్రాంతాలు, ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఈ వారం ఉక్రెయిన్-మోల్డోవా సరిహద్దు వద్ద డ్రోన్ దాడిలో ఇద్దరు మరణించగా, దక్షిణ ఉక్రెయిన్‌లో ప్రయాణికుల రైలుపై జరిగిన దాడిలో మహిళా కండక్టర్ మృతి చెందింది. కీవ్‌లోని రైల్వే డిపోపై జరిగిన మరో దాడిలో ఆరుగురు ఉక్రెయిన్ రైల్వే ఉద్యోగులు మరణించారు.
యూరప్‌కు పెరుగుతున్న భయం
ఉక్రెయిన్ వెలుపల కూడా రష్యాపై అనుమానాలు పెరుగుతున్నాయి. జర్మనీ గత ఆగస్టులో లైప్‌జిగ్ విమానాశ్రయంలో జరిగిన డ్రోన్ ఘటనకు రష్యానే కారణమని ఆరోపించింది. మాస్కో ఈ ఆరోపణలను తిరస్కరించింది. ఇటలీ నుంచి ఎస్టోనియా వరకు రక్షణ సంస్థలు, కీలక ప్రాంతాల్లో అనుమానాస్పద అగ్నిప్రమాదాలు కూడా నమోదయ్యాయి. వీటిలో కొన్ని ఘటనల వెనుక రష్యా ప్రమేయం ఉందని ఆయా దేశాలు అనుమానిస్తున్నాయి. అందుకే యహోదిన్ రైలుపై జరిగిన తాజా దాడిని కేవలం మరో డ్రోన్ దాడిగా చూడటం కష్టంగా మారింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికే నాలుగో సంవత్సరాన్ని దాటింది. ఇప్పుడు దాడులు ఉక్రెయిన్ కీలక రవాణా వ్యవస్థలపై కొనసాగుతూ, పోలాండ్ వంటి నాటో దేశాల సరిహద్దులకు చేరువవుతున్నాయి. దీంతో యుద్ధం ఎక్కడ ఆగుతుంది, యూరప్ భద్రతపై దాని ప్రభావం ఎంతవరకు వెళ్తుంది అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.




