Miss Universe 2026: మిస్ యూనివర్స్ 2026 విజేతగా జెన్నిఫర్ బారెటో.. భారత్‌కు నిరాశ!

Miss Universe 2026: 75వ మిస్ యూనివర్స్ 2026 కిరీటాన్ని ప్యూర్టో రికోకు చెందిన జెన్నిఫర్ బారెటో గెలుచుకున్నారు. భారత్ తరఫున పాల్గొన్న కజియా లిజ్ మెజో టాప్ 30తో సరిపెట్టుకున్నారు.

Arun Chilukuri
Published on: 25 Nov 2026 11:36 AM IST
Miss Universe 2026
X

Miss Universe 2026: మిస్ యూనివర్స్ 2026 విజేతగా జెన్నిఫర్ బారెటో.. భారత్‌కు నిరాశ!

Miss Universe 2026: ప్రతిష్టాత్మక 75వ మిస్ యూనివర్స్ (Miss Universe 2026) కిరీటం ప్యూర్టో రికో అందాల భామ జెన్నిఫర్ బారెటోను వరించింది. స్వదేశీ గడ్డపై జరిగిన ఈ మెగా అందాల పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన జెన్నిఫర్ విశ్వసుందరిగా నిలిచారు. గతేడాది విజేత, మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్.. జెన్నిఫర్‌కు అందాల కిరీటాన్ని అలంకరించారు.

ఈ పోటీల్లో డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మెలిస్సా నూనెజ్ తొలి రన్నరప్‌గా, వెనిజులాకు చెందిన క్లారా వేగాస్ గోయెట్జ్ రెండో రన్నరప్‌గా నిలిచారు. భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో టాప్ 30 వరకు చేరి ఆశలు రేపినప్పటికీ, స్విమ్‌సూట్ రౌండ్ తర్వాత ఎంపికైన టాప్ 12 ఫైనలిస్టుల జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. దీంతో భారత్‌కు నాలుగో మిస్ యూనివర్స్ కిరీటం కోసం నిరీక్షణ తప్పలేదు.

తుది రౌండ్‌లో నిలిచిన ఐదుగురు ఫైనలిస్టులకు (ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, వెనిజులా, డొమినికన్ రిపబ్లిక్, ప్యూర్టో రికో) న్యాయనిర్ణేతలు ఒకే ప్రశ్న వేశారు. "ప్రస్తుతం ప్రపంచానికి నాయకుల నుంచి అత్యంత అవసరమైనది ఏమిటి?" అన్న ప్రశ్నకు జెన్నిఫర్ ఇచ్చిన సమాధానం అందరి మనసు గెలుచుకుంది.

"నేటి ప్రపంచానికి వృత్తిపరమైన సానుభూతి, ఇతరుల పరిస్థితులను అర్థం చేసుకునే నాయకులు అవసరం. ప్రస్తుతం సమాజంలో ఇతరులను తీర్పు చెప్పడం, ప్రశ్నించడం ఎక్కువైంది. నాయకులు తమ విలువలకు కట్టుబడి, ఆదర్శంగా నిలుస్తూ ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాలి. ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించినప్పుడే సమర్థవంతమైన మార్పు తీసుకురాగలం" అని జెన్నిఫర్ స్పష్టంగా వివరించారు.

మిస్ యూనివర్స్ చరిత్రలో ప్యూర్టో రికోకు ఇది ఆరో విజయం కావడం విశేషం. గతంలో 1970 (మారిసోల్ మలరెట్), 1985 (డెబోరా కార్తీ-డియో), 1993 (దయనారా టోరెస్), 2001 (డెనిస్ క్వినోన్స్), 2006 (జులైకా రివెరా)లలో ప్యూర్టో రికో భామలు విజేతలుగా నిలిచారు. అలాగే, 2001 తర్వాత మళ్లీ ఇప్పుడు స్వదేశంలో పోటీలకు ఆతిథ్యమిస్తూ కిరీటం గెలుచుకోవడం ఈసారి ప్రత్యేకతగా నిలిచింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.