Pakistan: పాకిస్తాన్‌లో చిచ్చురేపుతున్న సింధూజలాలు...భారత్‌తో యుద్ధానికి కయ్యాలు

సింధూ జలాల వివాదం నేపథ్యంలో భారత్‌పై యుద్ధ హెచ్చరికలు చేసిన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో పాటు వివాదంగా మారాయి.

Balachander
Published on: 22 Jun 2026 11:50 AM IST
Pakistan: పాకిస్తాన్‌లో చిచ్చురేపుతున్న సింధూజలాలు...భారత్‌తో యుద్ధానికి కయ్యాలు
X

Pakistan: స్వంత దేశంలో రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం, తీవ్రమైన నీటి కొరతతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్.. ప్రజల దృష్టిని మళ్లించడానికి మళ్లీ భారత్‌పై విషం చిమ్మడం ప్రారంభించింది. నీటి భద్రత పేరుతో భారతదేశంపై యుద్ధానికి వెనుకాడబోమంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై తీవ్ర కలకలం రేపుతున్నాయి. దశాబ్దాలుగా సాగుతున్న నీటి వనరుల దుర్వినియోగాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇస్లామాబాద్ ఈ తరహా యుద్ధ ప్రేలాపనలకు దిగుతోందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఒక ఉగ్రదాడి.. మారిన వ్యూహాత్మక సమీకరణాలు

గతేడాది ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన అనాగరిక దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘాతుకానికి వ్యతిరేకంగా న్యూఢిల్లీ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. 1960 నాటి చారిత్రాత్మక 'సింధూ జలాల ఒప్పందాన్ని' భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. పాకిస్తాన్ తన భూభాగంపై ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించే వరకు ఈ ఒప్పందం పునరుద్ధరించే ప్రసక్తే లేదని భారత్ స్పష్టం చేసింది.

పాక్ రక్షణ మంత్రి ఆరోపణలు ... వాస్తవాలు

పాకిస్తాన్‌కు చెందిన 'ఏఆర్వై న్యూస్' ఛానల్‌తో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ...తమ జాతీయ భద్రతకు ముఖ్యంగా నీటి భద్రతకు ముప్పు వాటిల్లితే భారత్‌తో ఖచ్చితంగా యుద్ధానికి వెళ్తామని చెప్పాడు. భారతదేశం నీటిని ఆయుధంగా వాడుకుంటోందని ఆరోపించారు. అసలు నిజం ఏమంటే... ప్రపంచబ్యాంక్‌ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం, సింధూనదీ పరివాహక ప్రాంతంలోని దాదాపు 80శాతం నిటిని ఉపయోగించుకునే హక్కు పాకిస్తాన్‌కు ఉంది. అయితే, గత కొన్ని దశాబ్దాలుగా పాక్ ప్రభుత్వాల వైఫల్యం, అధ్వాన్నమైన నీటి నిర్వహణ కారణంగా ప్రస్తుతం ఆ దేశంలోని సింధ్, బలూచిస్తాన్ వంటి ప్రాాంతాలలో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. సాగునీరు అందక అక్కడి వ్యవసాయ భూములు బీడువారాయి.

డొల్లతనం బయటపడిందిలా..

భారత్‌పై నిందలు వేసే క్రమంలో పాక్ మంత్రి ఆసిఫ్ తన అజ్ఞానాన్ని తానే బయటపెట్టుకున్నారు. గతంలో తమ బృందాలు భారత్‌లో 115 సార్లు తనిఖీలు చేశాయని చెప్తూనే.. గత ఏడాది కాలంగా సరిహద్దుల్లో ఏం జరుగుతుందో, భారత్ ప్రాజెక్టుల పురోగతి ఏంటో తనకు కచ్చితమైన సమాచారం లేదని ఒప్పుకున్నారు. భారత జలశక్తి శాఖ జూన్ 2028 నాటికి పాకిస్తాన్‌కు వెళ్లే అదనపు నీటి ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకునే యోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తలతో పాక్ తీవ్ర భయాందోళనలకు గురవుతోంది. తన సొంత తప్పులను సరిదిద్దుకోకుండా, పొరుగు దేశంపై యుద్ధ నినాదాలు చేయడం ద్వారా పాకిస్తాన్ తన అంతర్గత వైఫల్యాలను దాచలేదనేది స్పష్టమౌతోంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story