Pakistan: సౌధీతో కలిసి పాక్ దూకుడు... వార్‌జోన్‌లోకి ఎంట్రీ?
సౌదీ అరేబియాతో కలిసి పాకిస్థాన్ హౌతీలపై సైనిక చర్యల్లో పాల్గొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాక్ యుద్ధ విమానాల వినియోగంపై వచ్చిన సమాచారం, సౌదీ-పాక్ రక్షణ ఒప్పందం, యెమెన్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతపై పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Pakistan: సౌదీ అరేబియాతో కలిసి పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. యెమెన్‌లో హౌతీలపై సౌదీ అరేబియా చేపడుతున్న సైనిక చర్యల్లో పాకిస్థాన్ వైమానిక దళం కూడా భాగస్వామ్యం అవుతోందనే సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇది నిజమైతే.. యెమెన్ యుద్ధంలో పాకిస్థాన్ ఇంతవరకు దూరంగా ఉంచుకున్న వైఖరిలో కీలక మార్పుగా భావించాల్సి ఉంటుంది.
యెమెన్ వార్‌జోన్‌లో పాక్ జెట్లు?
ది న్యూయార్క్ టైమ్స్‌కు పాకిస్థాన్‌కు చెందిన ఓ సీనియర్ సైనిక అధికారి వెల్లడించిన సమాచారం ప్రకారం.. హౌతీల స్థావరాలపై జరుగుతున్న దాడుల్లో పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానాలను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. పాకిస్థాన్ సైనిక మీడియా విభాగం అధిపతి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాత్రం పాకిస్థాన్ సైనికులు ఇప్పటికే సౌదీ అరేబియాలో ఉన్నారని ధృవీకరించారు. అయితే వారి సంఖ్య ఎంత? ఏ రకమైన సామర్థ్యాలతో అక్కడ ఉన్నారు? అనే వివరాలను మాత్రం ఆపరేషనల్ సీక్రెసీ కారణంగా వెల్లడించలేదు. అంటే పాకిస్థాన్ సైనిక ఉనికి అధికారికంగా అంగీకరించినప్పటికీ.. హౌతీలపై ప్రత్యక్ష వైమానిక దాడుల్లో పాక్ యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయనే అంశం ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు.
ఒక్కసారిగా ఎందుకు ఈ పరిణామం?
ఇటీవల సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ తమ పరస్పర రక్షణ ఏర్పాట్లను క్రియాశీలం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. హౌతీలు సౌదీ భూభాగంపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, అబ్హా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లను లక్ష్యంగా చేసుకుని కూడా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ముగ్గురు మరణించగా, పలువురు గాయపడినట్లు సౌదీ అధికారులు తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా సౌదీ అరేబియా యెమెన్‌లోని హౌతీ సైనిక స్థావరాలపై పెద్ద ఎత్తున వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ పాత్ర కేవలం సౌదీ భద్రతకు పరిమితం కాకుండా.. హౌతీల క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యాలను బలహీనపరిచే వైమానిక సహకారం దిశగా ఉండొచ్చని తెలుస్తోంది.
పాకిస్థాన్‌కు ఇదే అసలు సవాల్
యెమెన్ విషయంలో పాకిస్థాన్‌కు మొదటి నుంచీ ఒక క్లిష్టమైన పరిస్థితి ఉంది. ఒకవైపు సౌదీ అరేబియా పాకిస్థాన్‌కు అత్యంత సన్నిహిత మిత్రదేశం. మరోవైపు హౌతీలకు ఇరాన్ మద్దతు ఉందన్న విషయం అంతర్జాతీయంగా తెలిసిందే. ఇరాన్ పాకిస్థాన్‌కు పొరుగు దేశం మాత్రమే కాదు.. దౌత్య, భద్రతా పరంగా కూడా ముఖ్యమైన దేశం. అందుకే యెమెన్ యుద్ధంలో నేరుగా జోక్యం చేసుకోవడం ఇస్లామాబాద్‌కు ఎప్పటినుంచో సున్నితమైన అంశం. భూదళాలను పంపడం ఒకటైతే.. యుద్ధ విమానాలతో ప్రత్యక్ష దాడుల్లో పాల్గొనడం పూర్తిగా మరో స్థాయి నిర్ణయం.
ఎర్ర సముద్రం ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తత
ఇదిలా ఉండగా సౌదీ మద్దతు ఉన్న యెమెన్ బలగాలు ఎర్ర సముద్రం తీర ప్రాంతాల్లో హౌతీల ఆధీనంలోని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు దాడులు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన బాబ్ ఎల్-మందెబ్ జలసంధి చుట్టుపక్కల ప్రాంతాలు వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. అక్కడి పోరాటం కారణంగా సెప్టెంబర్ ప్రారంభం నుంచి దాదాపు 2 లక్షల మంది ప్రజలు యెమెన్‌లో నిరాశ్రయులైనట్లు అంతర్జాతీయ వలస సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ యుద్ధ విమానాలు నిజంగానే హౌతీలపై ఆపరేషన్లలో పాల్గొంటున్నట్లయితే.. యెమెన్ సంక్షోభం మరో కీలక మలుపు తిరిగినట్టే. సౌదీకి మద్దతు ఇవ్వడం ద్వారా మిత్రదేశ బాధ్యతను నెరవేర్చాలనుకుంటున్న పాకిస్థాన్.. అదే సమయంలో ఇరాన్‌తో ప్రత్యక్ష ఘర్షణకు వెళ్లకుండా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రస్తుతం పాకిస్థాన్ సైన్యం యుద్ధ విమానాల వినియోగంపై అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ఈ దశలో ఇది సీనియర్ పాకిస్థాన్ అధికారి వెల్లడించిన సమాచారంగా మాత్రమే చూడాలి. అధికారిక ధృవీకరణ వచ్చే వరకు పాక్ యుద్ధ విమానాలు యెమెన్‌లో ప్రత్యక్ష దాడులు చేస్తున్నాయనే విషయాన్ని తుది నిర్ణయంగా చెప్పడం తొందరపాటే. కానీ ఈ వార్త నిజమైతే.. యెమెన్ యుద్ధంలో పాకిస్థాన్ పాత్ర గతంతో పోలిస్తే గణనీయంగా మారినట్లే అవుతుంది.




