Massive Malware Attack : వెబ్‌ను భయపెడుతున్న మాల్వేర్లు... భయాందోళనలో బ్యాంకింగ్ రంగం
ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా ప్రముఖ వెబ్సైట్లపై మాల్వేర్ దాడి కలకలం రేపింది. HSBC, CNN, BBC, Zoom వంటి సంస్థల వినియోగదారుల బ్యాంకింగ్ వివరాలు, క్రిప్టో వాలెట్లకు ముప్పు ఏర్పడింది.
Massive Malware Attack : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే ప్రముఖ వెబ్సైట్లు సైబర్ దాడికి గురయ్యాయి. బ్యాంకింగ్, మీడియా, టెక్నాలజీ, రిటైల్, ప్రయాణ రంగాలకు చెందిన 100కు పైగా వెబ్సైట్లలోకి హానికరమైన సాఫ్ట్వేర్ చొరబడినట్లు సైబర్ భద్రతా పరిశోధకులు వెల్లడించారు. నవంబర్ 16, 2026న వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో CNN, BBC, Zoom, HSBC, IKEA, Salesforce వంటి అంతర్జాతీయ సంస్థల వెబ్సైట్లు కూడా ప్రభావితమైనట్లు Report URI పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, బ్యాంకు కార్డు వివరాలు, క్రిప్టోకరెన్సీ లావాదేవీలకు ఈ దాడి ముప్పుగా మారింది.
వెబ్సైట్లకు తెలియకుండానే మాల్వేర్ చొరబాటు
ఈ దాడిలో ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. సైబర్ నేరగాళ్లు నేరుగా ఆయా సంస్థల వెబ్సైట్లను హ్యాక్ చేయలేదు. Optimizely Web అనే వెబ్ ప్లాట్‌ఫామ్ ద్వారా అందుతున్న JavaScript కోడ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్న కొన్ని కస్టమర్ల ప్రాజెక్టుల్లోకి చొరబడి, వాటిలో హానికరమైన కోడ్‌ను చేర్చారు. దీంతో ఆ సేవలను ఉపయోగిస్తున్న ప్రముఖ సంస్థల వెబ్సైట్లను సందర్శించిన వారికి కూడా మాల్వేర్ చేరే అవకాశం ఏర్పడింది. ఆయా సంస్థలకు తమ వెబ్సైట్ల ద్వారా ప్రమాదకరమైన కోడ్ ప్రసారం అవుతున్న విషయం వెంటనే తెలియకపోవడం ఈ ఘటనలో ఆందోళన కలిగించే అంశం.
ఒక్క మాల్వేర్తో ఎన్నో రకాల దాడులు
ఈ సైబర్ దాడిలో ఉపయోగించిన మాల్వేర్ సాధారణ వైరస్‌లా కాకుండా, ఒకేసారి పలు రకాల సమాచారాన్ని దొంగిలించేలా రూపొందించినట్లు పరిశోధకులు తెలిపారు. వినియోగదారులు ఉపయోగించే క్రిప్టో వాలెట్ చిరునామాలను మార్చి, అసలు గ్రహీతకు వెళ్లాల్సిన డిజిటల్ కరెన్సీని దాడి చేసిన వారి ఖాతాలకు మళ్లించే సామర్థ్యం దీనికి ఉంది. అంతేకాకుండా ఆన్లైన్ చెల్లింపుల సమయంలో బ్యాంకు కార్డు వివరాలను సేకరించడం, బ్రౌజర్ కుకీలను దొంగిలించడం, వినియోగదారుల స్క్రీన్షాట్లను తీసుకోవడం వంటి పనులు కూడా చేసింది. ముఖ్యంగా ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకునేందుకు Coruna, DarkSword అనే iOS ఎక్స్‌ప్లాయిట్ కిట్లను ఉపయోగించినట్లు Report URI వెల్లడించింది. ఇప్పటికే కొన్ని క్రిప్టో లావాదేవీలు దాడి చేసిన వారి ఖాతాలకు చేరినట్లు ధృవీకరించినట్లు తెలిపింది.
17 గంటలకు పైగా కొనసాగిన దాడి
నవంబర్ 16న అంతర్జాతీయ సమయం ప్రకారం ఉదయం 04:21 గంటలకు ఈ హానికరమైన కోడ్ తొలిసారిగా గుర్తించబడింది. ఆ తర్వాత దాడి చేసిన వ్యక్తులు తమ మాల్వేర్ను 26 సార్లు మార్చి, కొత్త ఫీచర్లను జోడించారు. అదే రోజు రాత్రి 21:52 గంటల వరకు ఈ కార్యకలాపం కొనసాగినట్లు పరిశోధకులు అంచనా వేశారు. Report URI పరిశీలించిన 256 ప్రభావిత వెబ్సైట్లలో కేవలం 24 వెబ్సైట్లకే ఈ హానికరమైన కోడ్‌ను అడ్డుకునే Content Security Policy రక్షణ ఉన్నట్లు గుర్తించారు. అంటే మిగిలిన వెబ్సైట్లలో ఇలాంటి దాడులను అడ్డుకునే భద్రతా ఏర్పాట్లు సరిపోలేదనే విషయం స్పష్టమవుతోంది.
వినియోగదారులకు హెచ్చరిక
ఈ ఘటనపై Optimizely సంస్థ కూడా స్పందించింది. తమ Web Experimentation సేవలను ఉపయోగిస్తున్న కొందరు కస్టమర్లకు సంబంధించిన భద్రతా సమస్యను గుర్తించినట్లు తెలిపింది. ప్రమాదానికి కారణమైన మార్గాన్ని నిలిపివేసి, చొప్పించిన హానికరమైన కోడ్‌ను తొలగించినట్లు వెల్లడించింది. ప్రభావిత కస్టమర్లను నేరుగా సంప్రదించినట్లు పేర్కొంది. మరోవైపు, Optimizely సేవలను ఉపయోగించే సంస్థలు తమ ప్రాజెక్టు కోడ్‌ను పూర్తిగా పరిశీలించాలని, భద్రతా పాస్వర్డ్లు, యాక్సెస్ కీలను మార్చుకోవాలని Report URI సూచించింది. ఈ దాడికి గురైన వెబ్సైట్లను సందర్శించిన వినియోగదారులు తమ ఫోన్లలో ముఖ్యంగా iOS అప్డేట్లు వెంటనే చేసుకోవాలి. క్రిప్టో లావాదేవీలను మరోసారి పరిశీలించడంతో పాటు, బ్యాంకు కార్డు స్టేట్మెంట్లను గమనించాలని హెచ్చరించింది.




