Israel Election: బెంజమిన్ నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ఎన్నికల్లో హంగ్ టెన్షన్

Israel Election: ఇజ్రాయెల్ ఎన్నికల్లో బెంజమిన్ నెతన్యాహు కూటమికి మెజారిటీ దక్కలేదు. హంగ్ పార్లమెంటు ఏర్పడటంతో అరబ్ పార్టీలు కింగ్‌మేకర్‌గా మారాయి.

CR Reddy
Published on: 30 Oct 2026 7:34 AM IST
Israel Elections
X

Israel Elections

Israel Election:ఇజ్రాయెల్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలు వెలువడగా, సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నేతృత్వంలోని లికుడ్ పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లు సాధించలేకపోయింది. 120 స్థానాలు ఉన్న ఇజ్రాయెల్ పార్లమెంటు కెనెసెట్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు స్పష్టమైన మెజారిటీ ఏ ఒక్క కూటమికి దక్కలేదు. దీంతో ఇజ్రాయెల్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

బెంజమిన్ నెతన్యాహు కూటమికి తగ్గిన బలం

కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించిన అధికారిక తుది ఫలితాల ప్రకారం, బెంజమిన్ నెతన్యాహు మద్దతు ఉన్న కూటమికి కేవలం 53 సీట్లు మాత్రమే దక్కాయి. ఇందులో నెతన్యాహు లికుడ్ పార్టీ ఒంటరిగా 27 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరోవైపు ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసిన గాది ఐసెన్‌కోట్ నేతృత్వంలోని విపక్ష కూటమి 48 స్థానాలతో సరిపెట్టుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ అయిన 61 సీట్ల మార్కును ఏ కూటమి కూడా చేరుకోలేకపోవడంతో రాజకీయ సంక్షోభం తలెత్తింది.

కింగ్‌మేకర్లుగా మారిన అరబ్ పార్టీలు

ఈ ఎన్నికల్లో ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా అరబ్ నాయకత్వంలోని పార్టీలు రికార్డు స్థాయిలో ఏకంగా 19 స్థానాలను గెలుచుకున్నాయి. ఏ కూటమికి కూడా పూర్తి మెజారిటీ దక్కకపోవడంతో ఈ అరబ్ పార్టీలే ఇప్పుడు అత్యంత కీలకమైన కింగ్‌మేకర్ పాత్ర పోషిస్తున్నాయి. ఇజ్రాయెల్ సాంప్రదాయ రాజకీయాల్లో అరబ్ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంత సులభం కానప్పటికీ, సంకీర్ణ సర్కార్ ఏర్పాటుకు అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలితాలు వెలువడిన వెంటనే లికుడ్ పార్టీ కొన్ని అరబ్ స్థానాలపై విదేశీ జోక్యం, అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు గుప్పించడం కలకలం రేపింది.

ప్రభుత్వ ఏర్పాటుకు మిగిలిన మూడు మార్గాలు

పార్లమెంటులో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హర్జోగ్ త్వరలో అన్ని పార్టీల అధినాయకులతో సంప్రదింపులు జరపనున్నారు. మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఉన్న నేతను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మూడు మార్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది చిన్న పార్టీలను తమ వైపునకు తిప్పుకోవడం, రెండోది దేశంలో రాజకీయ స్థిరత్వం కోసం విపక్షాలతో కలిసి జాతీయ ఐక్యతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఒకవేళ ఇవి ఏవీ సాధ్యం కాకపోతే మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు బెంజమిన్ నెతన్యాహు కేర్‌టేకర్ ప్రధానిగా కొనసాగనున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.