Islam: 2035 నాటికి ప్రపంచంలో అతిపెద్ద మతంగా ఇస్లాం

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మతంగా ఇస్లాం మారనుందా? 2035 నాటికి ముస్లింల సంఖ్య క్రైస్తవులను దాటవచ్చని ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా నివేదిక అంచనా వేసింది.

CR Reddy
Published on: 19 Nov 2026 7:30 AM IST
Islam
X

Islam

Islam: ప్రపంచంలో అత్యధిక మంది అనుసరించే మతంగా ఇప్పటివరకు క్రైస్తవ మతం మొదటి స్థానంలో ఉండగా, ఇస్లాం రెండో స్థానంలో ఉంది. అయితే రాబోయే పదేళ్లలో ఈ పరిస్థితి మారే అవకాశం ఉందని ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా నివేదిక వెల్లడించింది. 2035 నాటికి ముస్లింల జనాభా క్రైస్తవుల సంఖ్యను దాటవచ్చని అంచనా వేసింది. 2020 నుంచి 2070 వరకు ప్రపంచంలోని ఏడు ప్రధాన మతాలు, మతంతో సంబంధం లేదని చెప్పుకునే వారి జనాభాలో వచ్చే మార్పులను ఈ అధ్యయనం పరిశీలించింది. ప్రపంచ జనాభాలో 99.98 శాతం మందికి ప్రాతినిధ్యం వహించే 201 దేశాలు, ప్రాంతాల వివరాలను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు.

జననాల రేటే ప్రధాన కారణం

ముస్లింల జనాభా వేగంగా పెరగడానికి ప్రధాన కారణం జననాల రేటు అని ప్యూ పరిశోధకులు చెబుతున్నారు. 2020–2025 మధ్య ప్రతి ముస్లిం మహిళకు సగటున 3.1 మంది పిల్లలు జన్మించగా, క్రైస్తవ మహిళల్లో ఈ సంఖ్య 2.5గా ఉంది. ఇతర మతాలకు చెందిన మహిళల్లో సగటు 1.6 మాత్రమే. ఒక తరం జనాభా సంఖ్య తగ్గకుండా కొనసాగాలంటే సాధారణంగా ఒక్కో మహిళకు 2.1 మంది పిల్లలు ఉండాలని జనాభా శాస్త్రవేత్తలు భావిస్తారు. మతం మారడం కూడా జనాభా లెక్కలపై ప్రభావం చూపుతున్నా, జననాలు, మరణాల మధ్య తేడాతో వచ్చే సహజ జనాభా పెరుగుదలే కీలక పాత్ర పోషిస్తోందని నివేదిక వివరించింది.

2070 నాటికి పరిస్థితి ఏంటి?

ప్యూ అంచనాల ప్రకారం 2020లో ప్రపంచవ్యాప్తంగా 227 కోట్ల మంది క్రైస్తవులు, 202 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. 2070 నాటికి ముస్లింల సంఖ్య 364 కోట్లకు చేరవచ్చని, క్రైస్తవుల సంఖ్య 296 కోట్లకు పెరగవచ్చని అంచనా. అంటే 2020 నుంచి 2070 మధ్య ముస్లింల జనాభా 80 శాతం పెరిగే అవకాశం ఉండగా, క్రైస్తవుల జనాభా సుమారు 30 శాతం పెరగవచ్చని నివేదిక చెబుతోంది. ప్రపంచ జనాభాలో ముస్లింల వాటా 25.6 శాతం నుంచి 35.8 శాతానికి పెరగవచ్చు. క్రైస్తవుల వాటా మాత్రం దాదాపు 29 శాతం వద్దే ఉండొచ్చని అంచనా.

ఆఫ్రికాలో పెరగనున్న క్రైస్తవులు

మతాల జనాభాలో మార్పులకు ఆఫ్రికా కీలక కేంద్రంగా మారనుందని ప్యూ నివేదిక పేర్కొంది. 2070 నాటికి ప్రపంచంలోని క్రైస్తవుల్లో 54 శాతం మంది ఉప-సహారా ఆఫ్రికా ప్రాంతంలో నివసించే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికాలో అత్యధిక క్రైస్తవ జనాభా ఉండగా, 2070 నాటికి కాంగోలో క్రైస్తవుల సంఖ్య 29.9 కోట్లకు చేరి అమెరికాను దాటవచ్చని అంచనా. మరోవైపు అమెరికాలో క్రైస్తవుల సంఖ్య 2020లో 21.7 కోట్ల నుంచి 2070 నాటికి 17.4 కోట్లకు తగ్గవచ్చని నివేదిక తెలిపింది.

ముస్లిం జనాభాలో పాకిస్థాన్ టాప్

ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశంగా ఇండోనేషియా కొనసాగుతోంది. అయితే 2070 నాటికి పాకిస్థాన్ ఈ స్థానాన్ని దక్కించుకోవచ్చని ప్యూ అంచనా వేసింది. ఆ దేశంలో ముస్లింల సంఖ్య 2020లో 22.7 కోట్ల నుంచి 2070 నాటికి 46.1 కోట్లకు పెరగవచ్చని తెలిపింది. భారత్, నైజీరియా వంటి దేశాల్లోనూ ముస్లింల జనాభా గణనీయంగా ఉండనుంది. మరోవైపు హిందువుల సంఖ్య పెరిగినా, ప్రపంచ జనాభాలో వారి వాటా కొంత తగ్గవచ్చని అంచనా. బౌద్ధుల సంఖ్య మాత్రం తగ్గే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇవన్నీ ప్రస్తుత జనాభా ధోరణులు కొనసాగుతాయనే అంచనాలే తప్ప, భవిష్యత్తులో తప్పకుండా ఇలాగే జరుగుతుందని చెప్పే ఖచ్చితమైన ఫలితాలు కావు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.