Parastoo Ahmadi: హిజాబ్ లేకుండా పాట పాడినందుకు ఇరాన్ గాయనికి 74 కొరడా దెబ్బల శిక్ష!
Parastoo Ahmadi: యూట్యూబ్‌లో హిజాబ్ ధరించకుండా పాట పాడిన ఇరాన్ గాయని పరస్తూ అహ్మదీతో పాటు నలుగురు బృంద సభ్యులకు అధికారులు 74 కొరడా దెబ్బల శిక్ష అమలు చేశారు.
Parastoo Ahmadi: హిజాబ్ లేకుండా పాట పాడినందుకు ఇరాన్ గాయనికి 74 కొరడా దెబ్బల శిక్ష!
Parastoo Ahmadi: ఇరాన్‌లో మహిళల స్వేచ్ఛ, హక్కుల అణచివేత మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హిజాబ్ ధరించకుండా పాట పాడి, ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ప్రముఖ ఇరానియన్ గాయని పరస్తూ అహ్మదీకి అక్కడి అధికారులు 74 కొరడా దెబ్బల శిక్షను అమలు చేశారు. నవంబర్ 23న ఆమెతో పాటు ఆమె సంగీత బృందంలోని నలుగురు సభ్యులకు కూడా ఈ శిక్షను విధించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
అసలేం జరిగింది?
2024 డిసెంబర్‌లో ఇరాన్‌లోని ఖోమ్ (Qom) నగరంలో పరస్తూ అహ్మదీ ఒక వర్చువల్ సంగీత ప్రదర్శన ఇచ్చారు. నలుగురు సహాయక గాయకులతో కలిసి హిజాబ్ లేకుండా ఆమె పాటలు పాడారు. ఆ సమయంలో అక్కడ ప్రత్యక్షంగా ప్రేక్షకులు ఎవరూ లేనప్పటికీ, ఆ ప్రదర్శన వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేయడంతో దానికి మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.
హిజాబ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఈ వ్యవహారంపై ఇరాన్ అధికారులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం ఇరాన్ న్యాయస్థానం కఠిన తీర్పును వెలువరించింది. గాయని అహ్మదీతో పాటు ఆమె బృందంలోని నలుగురు సభ్యులకు ఒక్కొక్కరికి 74 కొరడా దెబ్బల శిక్ష విధించింది. తాజాగా ఈ శిక్షను అమలు చేశారు. రెండేళ్ల పాటు ఆమె విదేశీ ప్రయాణాలు చేయకుండా, అలాగే ఎలాంటి కళా, సంగీత కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది.
2022లో హిజాబ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో మహ్సా అమినీ అనే యువతిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఆమె కస్టడీలోనే మరణించిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత ఇరాన్‌లో మహిళల హక్కుల కోసం దేశవ్యాప్తంగా భారీ నిరసనలు వెల్లువెత్తాయి. ఇప్పుడు గాయని పరస్తూ అహ్మదీకి కొరడా దెబ్బల శిక్ష అమలు చేయడం, ఇరాన్‌లో మహిళల వస్త్రధారణ, భావప్రకటనా స్వేచ్ఛపై కొనసాగుతున్న కఠిన ఆంక్షలకు నిదర్శనంగా నిలిచిందని మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.




