Gulf States: గల్ఫ్ దేశాలను వణికిస్తున్న ఇరాన్ యుద్ధం.. రూ.66 లక్షల కోట్ల నష్టం!
ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాలకు 2030 నాటికి 790 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. చమురు మౌలిక సదుపాయాలపై దాడులు, జీడీపీ క్షీణత, అమెరికా యుద్ధ వ్యయానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకుందాం.
Gulf States: ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. యుద్ధం కారణంగా 2030 నాటికి గల్ఫ్ దేశాలు సుమారు 790 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.66 లక్షల కోట్ల) ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అల్లియాంజ్ రీసెర్చ్ అంచనా వేసింది. ఈ నష్టం కేవలం ఆర్థిక వృద్ధి మందగించడం వల్ల ఏర్పడేది మాత్రమే. యుద్ధ దాడుల్లో దెబ్బతిన్న చమురు, ఇంధన మౌలిక సదుపాయాల మరమ్మతులకు అయ్యే మరో 200 బిలియన్ డాలర్ల వ్యయం దీనికి అదనం. అంటే యుద్ధ ప్రభావం గల్ఫ్ ప్రాంతంపై ఎంత భారీగా ఉందో ఈ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.
యుద్ధం వల్ల ఆర్థిక వృద్ధికి బ్రేక్
గల్ఫ్ సహకార మండలి (జీసీసీ)లో సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్ దేశాలు ఉన్నాయి. యుద్ధం ప్రారంభానికి ముందు ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు 2026 నుంచి 2030 మధ్య వేగంగా అభివృద్ధి చెందుతాయని అంచనాలు ఉండేవి. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ వృద్ధి సాధ్యం కాకపోవచ్చని అల్లియాంజ్ రీసెర్చ్ వెల్లడించింది. యుద్ధానికి ముందు అంచనా వేసిన ఉత్పత్తితో పోలిస్తే ఇప్పుడు ఈ దేశాలు సాధించగలిగే ఆర్థిక ఉత్పత్తిలో భారీ అంతరం ఏర్పడనుంది. ఈ వ్యత్యాసమే 790 బిలియన్ డాలర్ల నష్టంగా లెక్కించారు. ఇది జీసీసీ దేశాల మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) సుమారు 5.9 శాతానికి సమానం. మరోవైపు, హోర్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లోని ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు తీవ్ర ప్రభావం చూపాయి. చమురు క్షేత్రాలు, రిఫైనరీలు, పైప్లైన్లు సహా 80కి పైగా ఇంధన ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతిన్నట్లు అంచనాలున్నాయి. వీటి వల్ల కలిగిన భౌతిక నష్టం సుమారు 200 బిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు.
ఏ దేశంపై ఎంత ప్రభావం?
హోర్ముజ్ జలసంధిపై వాణిజ్య, ఇంధన రవాణా కోసం ఎక్కువగా ఆధారపడే దేశాలు ఈ యుద్ధంతో తీవ్రంగా నష్టపోతున్నాయి. అల్లియాంజ్ అంచనాల ప్రకారం ఖతార్ జీడీపీ 14 శాతం, కువైట్ 11 శాతం, బహ్రెయిన్ 8 శాతం తగ్గే అవకాశం ఉంది. సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ 2.8 శాతం, యూఏఈ 0.9 శాతం క్షీణించవచ్చని అంచనా. అయితే అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధాన మార్గంగా ఒమన్‌కు కొంత ప్రయోజనం కలగవచ్చని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ 3.3 శాతం వృద్ధి చెందవచ్చని నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. గల్ఫ్ ప్రాంత ఆర్థిక వ్యవస్థ 4.8 శాతం, సౌదీ అరేబియా 3.3 శాతం క్షీణించవచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
అమెరికాపైనా పెరుగుతున్న యుద్ధ భారం
ఈ యుద్ధం వల్ల నష్టపోతున్నది గల్ఫ్ దేశాలే కాదు. అమెరికాపైనా భారీ ఆర్థిక భారం పడుతోంది. ఇరాన్ యుద్ధానికి అమెరికా చేస్తున్న ఖర్చు ఇప్పటికే 48.3 బిలియన్ డాలర్లకు చేరినట్లు అంచనాలు వెల్లడిస్తున్నాయి. అయితే మధ్యప్రాచ్యంలో ఇరాన్ దాడులకు గురైన అమెరికా సైనిక స్థావరాలకు జరిగిన నష్టాన్ని ఈ మొత్తంలో చేర్చలేదు. విమానాల హ్యాంగర్లు, క్షిపణి దాడులను గుర్తించే రక్షణ వ్యవస్థలు, ఆయుధ గిడ్డంగులు, సైనికుల నివాస ప్రాంతాలు దెబ్బతిన్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషణ వెల్లడించింది. ఈ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను విడుదల చేయాలని అమెరికా చట్టసభ సభ్యులు రక్షణ శాఖను కోరుతున్నారు.
అమెరికా రాజకీయాల్లోనూ యుద్ధ వ్యయం చర్చ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 1.5 ట్రిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్‌కు ఆమోదం కోరుతున్న నేపథ్యంలో యుద్ధ ఖర్చులు కాంగ్రెస్‌లో కీలక చర్చగా మారాయి. యుద్ధం, దాని ఆర్థిక ప్రభావాలపై ప్రజల్లో అసంతృప్తి పెరగడం మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ తగలడానికి ఒక కారణమైంది. జనవరిలో డెమొక్రాట్లు కాంగ్రెస్‌పై నియంత్రణ సాధించిన తర్వాత ఈ అంశంపై రాజకీయ పోరు మరింత పెరిగే అవకాశం ఉంది.




