Cyber Blackmail: 14 ఏళ్ల బాలుడినంటూ 70 మంది బాలికలకు వల..కట్ చేస్తే 30 ఏళ్ల జైలు

బ్రిటన్‌లో 70 మంది బాలికలను ఆన్‌లైన్‌లో మోసం చేసి బ్లాక్‌మెయిల్ చేసిన భారతీయ విద్యార్థి బిలాల్ ఖాజీకి 30 ఏళ్ల జైలు శిక్ష పడింది. తాను 14 ఏళ్ల బాలుడినంటూ నకిలీ ఖాతాలతో పరిచయాలు పెంచుకున్నాడు.

CR Reddy
Published on: 15 Nov 2026 7:25 AM IST
Cyber Blackmail: 14 ఏళ్ల బాలుడినంటూ 70 మంది బాలికలకు వల..కట్ చేస్తే 30 ఏళ్ల జైలు
X

Cyber Blackmail: బ్రిటన్‌లో చిన్నారులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడిన భారతీయుడు బిలాల్ ఖాజీకి కోర్టు కఠిన శిక్ష విధించింది. సోషల్ మీడియాలో తనను 14 ఏళ్ల బ్రిటిష్ బాలుడిగా పరిచయం చేసుకుంటూ అమ్మాయిలతో స్నేహం పెంచుకున్నాడు. ఆ తర్వాత వారిని నమ్మించి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించి బ్లాక్‌మెయిల్ చేశాడు. ఈ కేసులో 70 మంది బాలికలను బాధితులుగా గుర్తించిన పోలీసులు.. మరో 180 మంది వరకు అతడి భారిన పడి ఉండవచ్చని అనుమానించారు. ఈ ఘటనపై విచారణ జరిపిన చెస్టర్ క్రౌన్ కోర్టు అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

రీజ్ పేరుతో నకిలీ ఖాతాలు

27 ఏళ్ల బిలాల్ ఖాజీ బ్రిటన్‌లో చదువుకుంటున్న సమయంలో ఈ నేరాలకు పాల్పడ్డాడు. స్నాప్‌చాట్, రోబ్లాక్స్, వింక్ వంటి సామాజిక మాధ్యమాలు, గేమింగ్ వేదికల్లో రీజ్ పేరుతో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేశాడు. తాను 14 ఏళ్ల బ్రిటిష్ బాలుడినని చెప్పుకుంటూ ఓ గుర్తుతెలియని బాలుడి ఫొటోలను ప్రొఫైల్‌లో ఉపయోగించాడు. అలా బాలికలతో పరిచయం పెంచుకుని, వారితో ప్రేమ సంబంధం ఉన్నట్లు నమ్మించేవాడు. కొంతకాలం తర్వాత వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు పంపాలని ఒత్తిడి చేసేవాడు.

ఫొటోలు పంపకపోతే బ్లాక్‌మెయిల్

బాలికలు ఫొటోలు పంపేందుకు నిరాకరిస్తే బిలాల్ బెదిరింపులకు దిగేవాడు. గతంలో పంపిన ఫొటోలు, వీడియోలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపిస్తానని చెప్పి వారిని భయపెట్టేవాడు. ప్రేమలో ఉన్నవారు ఇలాంటి ఫొటోలు పంచుకోవడం సహజమేనని నమ్మించేందుకు ప్రయత్నించేవాడు. కొన్ని సందర్భాల్లో బాలికల సామాజిక మాధ్యమ ఖాతాలను హ్యాక్ చేసి, వారు పంపిన సమాచారాన్ని ఇతరులకు పంపించాడు. కొందరితో ఏడాదికి పైగా పరిచయం కొనసాగిస్తూ వారిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఒక్క ఫిర్యాదుతో బయటపడిన వ్యవహారం

2021 నవంబర్‌లో 13 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్నాప్‌చాట్‌లో పరిచయమైన వ్యక్తి తన వయసువాడేనని ఆమె నమ్మింది. అయితే అతడు వ్యక్తిగత ఫొటోలు అడగడం, నిరాకరించినప్పుడు బెదిరించడం మొదలుపెట్టాడు. తర్వాత ఆమె ఖాతాను హ్యాక్ చేసి, గతంలో పంపిన ఫొటోలను స్నేహితులకు పంపించాడు. ఈ ఫిర్యాదుతో దర్యాప్తు మొదలైంది. బిలాల్ ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు యూజర్ పేర్లు, ఇతర డిజిటల్ ఆధారాల ద్వారా 180 మంది వరకు బాధితులు ఉండవచ్చని గుర్తించారు. వారిలో 70 మంది బాలికలను గుర్తించారు. వారి వయసు 11 నుంచి 17 ఏళ్ల మధ్య ఉంది. ఈ బాలికలు బ్రిటన్‌లోని 28 పోలీసు పరిధుల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

హీత్రో విమానాశ్రయంలో అరెస్ట్

బిలాల్ బ్రిటన్ విడిచి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. తిరిగి వచ్చిన సమయంలో 2023 జూలైలో హీత్రో విమానాశ్రయంలో అతడిని అరెస్ట్ చేశారు. అతడి ఫోన్‌లో వందల సంఖ్యలో అసభ్యకర చిత్రాలు, వీడియోలు ఉన్నట్లు బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ వెల్లడించింది. ఈ కేసులో బిలాల్ 37 అభియోగాలను అంగీకరించినట్లు చెషైర్ పోలీసులు తెలిపారు. నవంబర్ 13న చెస్టర్ క్రౌన్ కోర్టు అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష తర్వాత మరో ఎనిమిదేళ్ల పాటు కఠిన నిఘా, చట్టపరమైన ఆంక్షలు అమల్లో ఉంటాయి. అతడిపై లైంగిక హాని నిరోధక ఉత్తర్వు, నిరోధక ఉత్తర్వు కూడా జారీ చేశారు. జీవితాంతం లైంగిక నేరస్తుల రిజిస్టర్‌లో ఉండాల్సి ఉంటుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.