India US Trade Deal: ఫినిషింగ్ లైన్‌లో చారిత్రాత్మక ఒప్పందం.. భారత ఎగుమతులకు గోల్డెన్ ఛాన్స్!

India US Trade Deal: భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుంది.

Gagan kumar
Published on: 15 Nov 2026 7:39 AM IST
India US Trade Deal
X

India US Trade Deal: ఫినిషింగ్ లైన్‌లో చారిత్రాత్మక ఒప్పందం.. భారత ఎగుమతులకు గోల్డెన్ ఛాన్స్!

India US Tariffs: ప్రపంచ వాణిజ్య ముఖచిత్రాన్ని మార్చే కీలక పరిణామానికి రంగం సిద్ధమైంది. భారత్, అమెరికా మధ్య ఎంతో కాలంగా ఊరిస్తున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుంది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుండటం, ఇతర పోటీ దేశాల కంటే భారత్‌కు తక్కువ టారిఫ్‌లు విధిస్తామని అమెరికా హామీ ఇవ్వడం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద బూస్ట్‌గా మారనుంది.

ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక హెచ్‌టీ లీడర్‌షిప్ సమ్మిట్ వేదికగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఈ ఒప్పందంపై అత్యంత కీలక ప్రకటన చేశారు.ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంలోని అత్యధిక అంశాలు ఇప్పటికే పరిష్కారమయ్యాయని, చర్చలు దాదాపు ఫినిషింగ్ లైన్‌కు చేరుకున్నాయని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం మిగిలి ఉన్న కొన్ని స్వల్ప అభ్యంతరాలు భారత్ వైపు నుంచి కాదని, అమెరికా వైపు నుంచే మరికొన్ని సర్దుబాట్లు జరగాల్సి ఉందని జైశంకర్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ ఒప్పందం కొలిక్కి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై భారీగా దిగుమతి సుంకాలు విధిస్తోంది. ఈ తరుణంలో భారత్‌కు లభించనున్న ప్రత్యేక వెసులుబాటు ఒక గేమ్ ఛేంజర్‌గా మారనుంది.

వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చాక, ప్రపంచంలోని ఇతర పోటీ ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారతీయ ఉత్పత్తులపై తక్కువ సుంకాలు ఉండేలా చూస్తామని అమెరికా స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మార్కెట్ యాక్సెస్, సుంకాల తగ్గింపు విధివిధానాలపై తుది కసరత్తు పూర్తయిన వెంటనే ఏయే రంగాలకు ఎంత మేర లబ్ధి చేకూరుతుందనే పూర్తి స్పష్టత రానుంది.

అమెరికా భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఈ ఒప్పందం ఖరారైతే భారత ఆర్థిక వ్యవస్థకు బహుముఖ ప్రయోజనాలు చేకూరనున్నాయి. వస్త్రాలు , తోలు ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతుల్లో చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి పోటీ దేశాల కంటే భారత్‌కు తక్కువ టారిఫ్‌లు ఉంటాయి.

దీనివల్ల అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తులు తక్కువ ధరకే లభించి, డిమాండ్ భారీగా పెరుగుతుంది.అమెరికాకు తక్కువ సుంకాలతో ఎగుమతి చేసే అవకాశం ఉండటంతో, అంతర్జాతీయ తయారీ దిగ్గజాలు తమ ఫ్యాక్టరీలను భారత్‌లో ఏర్పాటు చేసేందుకు క్యూ కడతాయి.

ఇది మేక్ ఇన్ ఇండియాకు ఊతమివ్వడంతో పాటు భారీగా ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఇరు దేశాల మధ్య ఎగుమతి, దిగుమతుల విలువ రాబోయే కొన్నేళ్లలో సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. మొత్తానికి, మారుతున్న అంతర్జాతీయ వాణిజ్య సమీకరణాల మధ్య భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం భారతదేశాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.