Russian Oil: చమురు సెగ తగలకుండా భారత్ ప్లాన్.. రష్యా, ఇరాన్ నుంచి భారీగా దిగుమతులు!
Russian Oil: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల దేశంలో ఇంధన సరఫరాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది.
Russian Oil: చమురు సెగ తగలకుండా భారత్ ప్లాన్.. రష్యా, ఇరాన్ నుంచి భారీగా దిగుమతులు!
Russian Oil: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల దేశంలో ఇంధన సరఫరాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, భారత్ తన ఇంధన భద్రతను పటిష్టం చేసుకునేందుకు రష్యా మరియు ఇరాన్ దేశాల నుంచి భారీగా చమురును సేకరిస్తోంది.
రష్యా నుంచి రెట్టింపు కొనుగోళ్లు
బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం.. భారత రిఫైనరీలు రష్యా నుంచి సుమారు 60 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేశాయి. ఇవి వచ్చే నెలలోనే డెలివరీ కానున్నట్లు సమాచారం. బ్రెంట్ క్రూడ్ ధర కంటే బ్యారెల్‌కు 5 నుంచి 15 డాలర్లు అదనంగా చెల్లించి మరీ ఈ చమురును బుక్ చేసినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఈ కొనుగోళ్లు దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. రష్యా చమురుపై అమెరికా ఆంక్షలు సడలించడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
హోర్ముజ్ జలసంధి సెగ.. అమెరికా మినహాయింపులు!
ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి వద్ద నౌకల రవాణాపై అనిశ్చితి కొనసాగుతున్నంత కాలం, రష్యా చమురుపై అమెరికా మినహాయింపులను పొడిగిస్తుందని భారత అధికారులు భావిస్తున్నారు. ఈ వెసులుబాటును ఉపయోగించుకుని దేశీయ అవసరాలకు సరిపడా స్టాక్‌ను సిద్ధం చేసుకుంటున్నారు.
ఇరాన్ చమురు బరిలో రిలయన్స్
చమురు దిగుమతుల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను కూడా అమెరికా ఎత్తివేయడంతో, రిలయన్స్ ఇండస్ట్రీస్ రంగంలోకి దిగింది.
నేషనల్ ఇరానియన్ ఆయిల్ కో (NIOC) నుంచి సుమారు 5 మిలియన్ బ్యారెళ్ల చమురును రిలయన్స్ కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
అయితే, ఈ భారీ కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి కానీ, కంపెనీల నుంచి కానీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏది ఏమైనా, ప్రపంచ యుద్ధ మేఘాల మధ్య దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండేలా చూడటమే లక్ష్యంగా భారత్ ఈ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.




