Imran Khan: నేను ఈ జైల్లోనే చస్తాను..జడ్జిలకు మాజీ ప్రధాని సంచలన లేఖ
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి దేశ అత్యున్నత న్యాయమూర్తులకు లేఖ రాశారు. తనకు బ్రెయిన్ హెమరేజ్, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారని తెలిపారు.
Imran Khan
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో సరైన వైద్యం అందడం లేదని, తన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని ఆరోపించారు. తనకు బ్రెయిన్ హెమరేజ్, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించినట్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో తాను ప్రాణాలతో బయటకు వస్తానో లేదో తెలియడం లేదంటూ పాకిస్థాన్ అత్యున్నత న్యాయమూర్తులకు లేఖ రాశారు. తనతో పాటు భార్య బుష్రా బీబీకి కూడా మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులకు లేఖ
2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్.. తన న్యాయవాది బారిస్టర్ సల్మాన్ సఫ్దర్ ద్వారా ఈ లేఖను పంపించారు. పాకిస్థాన్ సుప్రీంకోర్టు, ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్టు, ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఉద్దేశించి ఈ విజ్ఞప్తి చేశారు. నవంబర్ 11న రావల్పిండిలోని అడియాలా జైలులో ఇమ్రాన్‌ను ఆయన న్యాయవాది కలిశారు. ఆ సమయంలో ఇమ్రాన్ చెప్పిన విషయాల ఆధారంగా లేఖ సిద్ధం చేసినట్లు సల్మాన్ సఫ్దర్ వెల్లడించారు. అనంతరం నవంబర్ 16న ఈ లేఖను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తనను రోజులో దాదాపు 22 గంటల పాటు ఏకాంతంగా ఉంచుతున్నారని, కుటుంబ సభ్యులు, న్యాయవాదులతో మాట్లాడే అవకాశం కూడా పరిమితంగా ఉందని ఇమ్రాన్ ఆరోపించారు.
గుండెపోటు ముప్పు ఉందని ఆవేదన
జైలులో ఏకాంత నిర్బంధం కారణంగా తన మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతోందని ఇమ్రాన్ లేఖలో పేర్కొన్నారు. తన రక్తపోటు అదుపు తప్పిందని, నవంబర్ 10న 192, 193 స్థాయికి చేరిందని తెలిపారు. బ్రెయిన్ హెమరేజ్, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించినట్లు వివరించారు. ఇప్పటికే గుండెకు నష్టం జరిగిందని కూడా చెప్పినట్లు పేర్కొన్నారు. తన కుడి కంటికి 85 శాతం చూపు తగ్గిపోయిందని గతంలో న్యాయవాది ద్వారా వెల్లడించిన విషయం కూడా ఈ లేఖలో ప్రస్తావనకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో తనకు మెరుగైన వైద్యం అందించాలని, గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని న్యాయమూర్తులను కోరారు.
భార్య బుష్రా బీబీ ఆరోగ్యంపైనా ఆందోళన
తన భార్య బుష్రా బీబీ ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోందని ఇమ్రాన్ తెలిపారు. ఆమెకు గత ఏప్రిల్‌లో కంటి రెటీనా సమస్య తలెత్తడంతో శస్త్రచికిత్స జరిగినట్లు వెల్లడించారు. అయినప్పటికీ ఆమె చూపు మరింత బలహీనపడుతోందని, మరోసారి ఆపరేషన్ చేయకపోతే శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెకు వైద్యులను సంప్రదించే అవకాశం కల్పించడం లేదని, వైద్య నివేదికలు కూడా అందుబాటులో ఉంచడం లేదని ఆరోపించారు. బుష్రా బీబీ 2025 జనవరి నుంచి అవినీతి కేసులో జైలులో ఉన్నారు. తనతో పాటు భార్యకు కూడా సరైన చికిత్స అందేలా చూడాలని ఇమ్రాన్ న్యాయస్థానాలను కోరారు.
ప్రభుత్వం ఏమంటోంది?
గత ఆగస్టు 18న తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించాలని, వైద్య బృందంతో పరీక్షలు చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు ఇమ్రాన్ తన లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ ఆదేశాలు పూర్తిగా అమలు కాలేదని ఆరోపించారు. మరోవైపు, ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆయన చేసిన ఆరోపణలను పాక్ ప్రభుత్వం ఖండించింది. ఆయనను ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి ఎనిమిదిసార్లు పరీక్షల కోసం తీసుకెళ్లామని, ఆరోగ్యం, రక్తపోటు సాధారణంగానే ఉన్నాయని మంత్రి తారిఖ్ ఫజల్ చౌదరి తెలిపారు. భోజనం, పుస్తకాలు, టీవీ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ఇమ్రాన్ జైల్లో ఏకాంత నిర్బంధంలో ఉన్నారన్న ఆరోపణలను కూడా ప్రభుత్వం గతంలో తోసిపుచ్చింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి, జైలు సౌకర్యాలపై పాక్‌లో మరోసారి చర్చ మొదలైంది.




