Hitler Pizza: సోషల్ మీడియా పవర్ః విద్యార్థిని కటకటాలపాలు చేసిన హిట్లర్ పిజ్జా...
పిజ్జా ఆర్డర్‌లో 'అడాల్ఫ్ హిట్లర్' పేరు నమోదు చేసినందుకు రష్యాలో 18 ఏళ్ల విద్యార్థికి 5 రోజుల జైలు శిక్ష విధించారు. సోషల్ మీడియా, నాజీ చిహ్నాలు, రష్యా కఠిన చట్టాల గురించి తెలుసుకుందాం.
Hitler Pizza: సోషల్ మీడియా యుగంలో సరదా కోసం చేసే పనులు ఒక్కోసారి జీవితాలనే తలకిందులు చేస్తాయి. తాజాగా రష్యాలో జరిగిన ఒక సంఘటన దీనికి నిదర్శనంగా నిలిచింది. పిజ్జా ఆర్డర్ బుకింగ్ పేరు స్థానంలో "అడాల్ఫ్ హిట్లర్" అని నమోదు చేసినందుకు రష్యాకు చెందిన 18 ఏళ్ల విద్యార్థికి కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. నాజీయిజం, తీవ్రవాద వ్యాప్తిని అణచివేసే చట్టాల కింద రష్యా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. సోషల్ మీడియాలో ఎంత జాగ్రత్తగా ఉండాలో...ఎలాంటి వాటిని వినియోగించాలో...వేటిని ప్రభుత్వం నేరంగా భావిస్తుందో తెలుసుకోవాలని ఈ సంఘటన ప్రస్తుత తరానికి గుర్తుచేస్తోంది.
నిజ్నీ తాగిల్ నగరంలో ఏం జరిగింది?
రష్యాలోని ఉరల్స్ ప్రాంతానికి చెందిన నిజ్నీ తాగిల్ నగరంలోని ఒక షాపింగ్ సెంటర్‌లో ఈ విచిత్ర సంఘటన జరిగింది. 18 ఏళ్ల తిమోఫే వఖోనిన్ అనే కాలేజీ విద్యార్థి ఒక స్థానిక రెస్టారెంట్‌లో పిజ్జా ఆర్డర్ చేస్తూ, కస్టమర్ పేరుగా క్రూర పాలకుడు 'అడాల్ఫ్ హిట్లర్' అని ఇచ్చాడు. అయితే, అదే సమయంలో అక్కడ ఉన్న అధికారిక 'యునైటెడ్ రష్యా' పార్టీ ప్రతినిధి అలెక్సీ స్వలోవ్, ఆయనతో పాటు ఉన్న ఉక్రెయిన్ యుద్ధ రష్యన్ ఆర్మీ వెటరన్ దీనిని గమనించారు. దేశం కోసం రక్తం చిందించిన సైనికుడి ముందే నాజీ పాలకుడి పేరును వాడటాన్ని వారు తీవ్రంగా పరిగణించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
క్షణాల్లో చుట్టుముట్టిన పోలీసులు ...విచారణలో మరిన్ని నిజాలు
రష్యా అంతర్గత భద్రతా విభాగం రంగంలోకి దిగి, సదరు విద్యార్థిని కాలేజీ ప్రాంగణంలోనే అరెస్ట్ చేసింది. నిందితుడు తిమోఫే పోలీసులకు ఎలాంటి అడ్డు చెప్పకుండా, కన్నీళ్లతో క్షమాపణలు చెప్పాడు. తనకు ఆ పేరు వెనుక ఉన్న తీవ్రత తెలియదని వాదించాడు. పోలీసులు అతని మొబైల్, సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేయగా, అతను కాలేజీ డెస్క్‌పై నిషేధిత నాజీ చిహ్నాలను గీసి, వాటిని ఆన్‌లైన్ చాట్ ఫోరమ్‌లలో షేర్ చేసినట్లు ఆధారాలు లభించాయి.
రష్యా ఎందుకంత కఠినంగా ఉంటుంది?
ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రష్యా ఈ తరహా చర్యలపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ఉక్రెయిన్‌తో నడుస్తున్న యుద్ధం నేపథ్యంలో, రష్యా సమాజంలో దేశభక్తిని పెంపొందించడానికి, "నాజీయిజం వ్యతిరేకత" ను ఒక బలమైన రాజకీయ ఆయుధంగా వాడుతోంది. చిన్న చిన్న పట్టణాల్లో సైతం సోషల్ మీడియా గ్రూపులు, పబ్లిక్ ప్రదేశాలపై ప్రభుత్వ నిఘా ఎంత పటిష్టంగా ఉందో ఈ సంఘటన నిరూపిస్తోంది. డిజిటల్ మీడియాలో సరదా కోసం చేసే ఇటువంటి పనులు కెరీర్‌ను ఎలా నాశనం చేస్తాయో చెప్పడానికి ఈ ఐదురోజుల జైలు శిక్షే ఉదాహరణ. మనదేశంలో సోషల్ మీడియాపై పెద్దగా ఆంక్షలు లేకున్నా...నిఘా మాత్రం ఉంటూనే ఉంటుంది. ఎవరైనా సరే ప్రభుత్వ వ్యతిరేక, లేదా ప్రభుత్వం నిషేధించిన వాటిపై కామెంట్లు, పోస్టులు చేస్తుంటే వారిపై తప్పకుండా యాక్షన్ తీసుకుంటుంది. కాబట్టి యువత దూకుడుగా కాకుండా ఆలోచించి అడుగులు వేయడం మంచిది.




