Flydubai Attack: ఫ్లైదుబాయ్ హైజాకింగ్ యత్నం.. టెర్రరిస్ట్‌ను విడిపించేందుకు కేబిన్ క్రూ యత్నం
Flydubai Attack: ఫ్లైదుబాయ్ విమాన హైజాకింగ్ యత్నంలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. టెర్రరిస్ట్ కో-పైలట్‌ను ప్రయాణికులు బంధిస్తే విడిచిపెట్టాలని కేబిన్ క్రూ డిమాండ్ చేయడం కలకలం రేపింది.
Flydubai Attack
Flydubai Attack: వైమానిక చరిత్రలో సంచలనం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాకింగ్ యత్నంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న FZ 1073 విమానంలో ఓమానీ కో-పైలట్ హమ్మామ్ అల్-హమ్మామి కాక్పిట్పై దాడి చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఇజ్రాయెలీ పౌరులు తాజాగా ప్రముఖ అమెరికన్ వార్తాపత్రిక న్యూయార్క్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక దిగ్భ్రాంతికర విషయాలు బయటపెట్టారు. దాడి చేసిన ఉగ్రవాదిని తాము బంధిస్తే ఫ్లైదుబాయ్ కేబిన్ క్రూ సభ్యులు తమతో వాగ్వాదానికి దిగారని వారు ఆరోపించారు.
వైర్లతో బంధించిన ప్రయాణికులు
ఓమానీ కో-పైలట్ విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసినప్పటికీ భారతీయ కెప్టెన్ స్మిత్ మచార్ తీవ్ర గాయాలతోనే కాక్‌పిట్ ఎమర్జెన్సీ లాక్ ఓపెన్ చేశారు. వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెలీ ప్రయాణికులు ధైర్యంగా కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లి ఆ కుట్రదారుడిని కిందపడేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికులు తమ వద్ద ఉన్న వైర్లతో ఆ నిందితుడి చేతులు వెనక్కి కట్టి పడేసి కదలకుండా చేశారు. ఈ సాహసంతో పెద్ద విమాన ప్రమాదం తృటిలో తప్పింది.
టెర్రరిస్ట్‌ను విడిచిపెట్టాలని సిబ్బంది ఒత్తిడి
అయితే దాడి చేసిన కో-పైలట్‌ను ప్రయాణికులు బంధించిన తర్వాత విమాన సిబ్బంది వ్యవహార శైలి అందరినీ ఆశ్చర్యపరిచింది. టెర్రరిస్ట్‌ను వెంటనే వదిలిపెట్టాలంటూ ఎయిర్‌హోస్టెస్‌లు, కేబిన్ క్రూ మెంబర్లు ప్రయాణికులతో గొడవకు దిగారు. మీరు దేవుళ్లు కారంటూ, అతన్ని చంపవద్దంటూ తమపై సిబ్బంది తీవ్రంగా అరిచారని ప్రయాణికులు తెలిపారు. తాము అతన్ని చంపడంలేదని, ప్రయాణికుల రక్షణ కోసమే కట్టేసామని చెప్పినా క్రూ సభ్యులు వినకుండా వాదనకు దిగడంతో అందరికీ అనుమానం వచ్చింది.
కమాండ్ తీసుకున్న ప్రయాణికులు
క్రూ సభ్యుల అనుమానాస్పద ప్రవర్తనను గమనించిన ఇజ్రాయెలీ ప్రయాణికులు వెనక్కి తగ్గలేదు. విమాన భద్రత తమ చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్న ప్రయాణికులు కేబిన్ సిబ్బందిని గట్టిగా హెచ్చరించారు. మొత్తం సిబ్బందిని కాక్‌పిట్ ఏరియా నుంచి ఖాళీ చేయించి విమాన మధ్య భాగంలోని సీట్లలో వెళ్లి కూర్చోవాలని ఆదేశించారు. అలాగే మరో బలమైన ప్రయాణికుడిని కాక్‌పిట్ ద్వారం వద్ద సెక్యూరిటీ గార్డుగా నిలబెట్టారు. ఆ తర్వాత విమానంలో ఉన్న మరో ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు విమానాన్ని టేకోవర్ చేసి సౌదీ అరేబియాలోని తబుక్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేయించారు.
దర్యాప్తునకు ఆదేశించిన భద్రతా ఏజెన్సీలు
ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో యూఏఈ, ఇజ్రాయెల్ దేశాల నిఘా వర్గాలు దర్యాప్తును మరింత వేగవంతం చేశాయి. దాడికి పాల్పడిన కో-పైలట్‌కు కేబిన్ క్రూ సిబ్బంది ఎందుకు మద్దతుగా నిలిచారు, ఉగ్రవాదిని విడిపించాలని ఎందుకు ఒత్తిడి తెచ్చారనే కోణంలో లోతైన విచారణ జరుగుతోంది. విమాన సిబ్బందికి ఈ కుట్రతో ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో అంతర్జాతీయ విమానయాన భద్రతా నిబంధనలపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.




