Flydubai Flight: ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు సిద్దమైన ఇజ్రాయెల్ !
Flydubai Flight: ఫ్లైదుబాయ్ విమానంలో పైలట్ పై కోపైలట్ దాడి చేసిన ఘటనలో.. ఆ విమానాన్ని కూల్చేందుకు ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లను సిద్ధం చేసినట్లు సీబీఎస్ న్యూస్ నివేదించింది. పూర్తి వివరాలు.
Flydubai Flight: ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు సిద్దమైన ఇజ్రాయెల్ !
Flydubai Flight: ఫ్లైదుబాయ్ 1073 విమానంలో పైలట్ స్మిత్ మచ్చర్‌పై ఓమనీ కోపైలట్ దాడి చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, 170 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానాన్ని కూల్చేందుకు ఇజ్రాయెల్ సైతం సిద్ధమైనట్లు తాజాగా వెల్లడైంది. సౌదీ అరేబియాలో ఆ విమానం దిగడానికి ముందే.. ఇజ్రాయెల్ తన ఫైటర్ జెట్లను మోహరించినట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ 'సీబీఎస్ న్యూస్' తన వార్తా కథనంలో వెల్లడించింది.
అసలేం జరిగింది?
దుబాయ్ నుంచి బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో పైలట్‌పై దాడి జరిగిన తర్వాత అకస్మాత్తుగా దారి మళ్లింది. ఆ సమయంలో విమానం నుంచి ఎటువంటి సమాధానం (సందేశం) అందకపోవడంతో.. ఇజ్రాయెలీ వైమానిక దళం (IAF) అప్రమత్తమైంది. ఆ విమానాన్ని కూల్చివేసేందుకు సన్నద్ధమైంది.
విమానం దారి మళ్లడంతో ఇజ్రాయెల్ అధికారులు తక్షణమే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, కమాండ్ సెంటర్‌ను సెటప్ చేశారు. ఇజ్రాయెలీ వైమానిక క్షేత్రాన్ని తాత్కాలికంగా మూసివేసి, సరిహద్దుల వద్ద ఫైటర్ జెట్లను మోహరించారు.
ఒకవేళ ఆ విమానం తమ వైమానిక క్షేత్రానికి దగ్గరగా వస్తే.. జోర్డాన్‌లోని వైమానిక క్షేత్రం నుంచి యుద్ధ విమానాలను పంపి పరిస్థితిని అంచనా వేసేవాళ్లమని ఇజ్రాయెల్ తెలిపింది. కాక్‌పిట్‌తో విజువల్ కాంటాక్ట్ ఏర్పాటు చేసుకుని, ఉగ్రవాదుల హైజాక్ కోణంలో పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకునేవారమని పేర్కొంది.
విమానాన్ని హైజాక్ చేసి ఉగ్రవాదులు రెస్పాండ్ కాకపోతే, విమానాన్ని చెక్ చేసిన తర్వాత కమిటీ ఆ వివరాలను డిఫెన్స్ మినిస్టర్, ప్రధానికి చేరవేసేదని రిపోర్టులో తెలిపారు. అయితే విమానాన్ని షూట్ చేసే తుది నిర్ణయం మాత్రం ప్రధాని చేతుల్లోనే ఉంటుందని సీబీఎస్ న్యూస్ స్పష్టం చేసింది. బెన్ గురియన్ విమానాశ్రయం, అజ్రేలీ సెంటర్ లేదా దేశంలోని ఇతర హై-వాల్యూ టార్గెట్‌లను ఆ విమానం ఢీకొట్టడం కంటే.. గాల్లోనే దానిని పేల్చివేయడమే ఉత్తమంగా భావించేవాళ్లమని ఇజ్రాయెల్ వర్గాలు ఆ కథనంలో వెల్లడించాయి.
అసలు కుట్ర ఇదేనా?
కాక్‌పిట్‌లో భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ (Smith Macher) పై ఓమనీ కోపైలట్ అటాక్ చేసిన సమయంలో అతను 'మేడే కాల్' (Mayday Call) ఇచ్చాడు. ఆ తర్వాత కాక్‌పిట్ డోర్ ఓపెన్ కావడంతో ప్రయాణికులు కోపైలట్‌ను నిర్బంధించారు. అయితే ఇజ్రాయెల్ గగనతలంలోకి ప్రవేశపెట్టి ఆ విమానాన్ని కూల్చేయాలని ఓమనీ కోపైలట్ కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం గాయపడిన పైలట్ స్మిత్ మచ్చర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.




