Italy Protests: అట్టుడుకుతున్న యూరప్‌.. ఇటలీ, ఫ్రాన్స్, అల్బేనియా దేశాల్లో రోడ్డెక్కిన ప్రజలు

Italy Protests: ప్రస్తుతం యూరప్ ఖండంలోని పలు దేశాలు తీవ్రమైన అశాంతి, నిరసనలతో అట్టుడుకుతున్నాయి.

CR Reddy
Published on: 22 Oct 2026 7:30 AM IST
France Riots
X

France Riots

Italy Protests: ప్రస్తుతం యూరప్ ఖండంలోని పలు దేశాలు తీవ్రమైన అశాంతి, నిరసనలతో అట్టుడుకుతున్నాయి. ఇటలీలోని మిలన్, నేపిల్స్ నగరాలలో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. పెరిగిన ఇంధన ధరలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఇటలీ మద్దతు తెలపడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఖరీదైన స్టోర్లు అలాగే చిన్న దుకాణాలలో విపరీతమైన లూటీలు జరుగుతున్నాయి. దుకాణదారులు ప్రాణాలు రక్షించుకోవడానికి గన్‌లతో కాపలా కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ అల్లర్లను అణచివేయడానికి ప్రధాని జార్జియా మెలోని అత్యవసర సమావేశం నిర్వహించి కఠిన చట్టాలను తీసుకువచ్చారు. దాడులకు పాల్పడేవారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, 20 వేల యూరోల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

ఫ్రాన్స్‌లో విధ్వంసం

ఫ్రాన్స్‌లో కూడా ఇదే విధమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాఠశాలల విద్యార్థుల ఆందోళనతో మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హింసాత్మకంగా మారింది. నిరసనకారులు దుకాణాల అద్దాలు పగలగొట్టి ఖరీదైన వస్తువులను, గడియారాలను ఎత్తుకెళ్తున్నారు. రెంనేస్ నగరంలో పోలీసులపై దాడులు జరగడం, బారికేడ్లను తగలబెట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. వలసదారుల సమస్యను నియంత్రించడంలో అధ్యక్షుడు ఇమాన్యూల్ మాక్రోన్ విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రభుత్వం కర్ఫ్యూలతో పాటు కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది.

అల్బేనియాలో ఫ్లెమింగో విప్లవం

ఇటలీ, ఫ్రాన్స్ బాటలోనే అల్బేనియా దేశం కూడా అగ్నిగుండంగా మారింది. సుప్రీంకోర్టు, విద్యాశాఖ కార్యాలయాలపై ఆందోళనకారులు దాడులు చేసి నిప్పుపెట్టారు. ప్రధాని ఎదీ రామా చేపట్టిన లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్ట్‌ను స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పక్షుల ఆవాసాలను నాశనం చేస్తూ చేపడుతున్న ఈ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ఫ్లెమింగో విప్లవం పేరుతో యువత ఉద్యమాన్ని ఉధృతం చేసింది. ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.

యూరప్ సంక్షోభానికి అసలు కారణాలు

యూరప్ దేశాలలో జరుగుతున్న ఈ వరుస ఆందోళనలకు ప్రధాన కారణాలు నిరుద్యోగం, విపరీతమైన ద్రవ్యోల్బణం, ప్రజా సంక్షేమ పథకాల వైఫల్యమే. ప్రభుత్వాలు స్థానిక సమస్యలను గాలికొదిలి విదేశీ విధానాలపై దృష్టి పెట్టడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రగిలించింది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితులు ఏ మోలకి వెళ్తాయనే దానిపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ జరుగుతోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.