విమానాలకు బెదిరింపులు.. యూరప్‌లో హై అలర్ట్
ఐరోపా దేశాల్లో నకిలీ బాంబు బెదిరింపులు విమాన ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గురువారం ఒక్కరోజే పలు ప్రయాణికుల విమానాలకు బెదిరింపులు
Europe Flight Bomb Threat
ఐరోపా దేశాల్లో నకిలీ బాంబు బెదిరింపులు విమాన ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గురువారం ఒక్కరోజే పలు ప్రయాణికుల విమానాలకు బెదిరింపులు రావడంతో కొన్ని విమానాలను దారి మళ్లించగా, మరికొన్ని అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి. గత వారం రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటనలు రెండోసారి చోటుచేసుకోవడం భద్రతా సంస్థలను అప్రమత్తం చేసింది.
ఫ్రాన్స్‌లో దిగిన ఐరిష్ విమానం
డబ్లిన్ నుంచి రోమ్కు వెళ్తున్న ఏర్లింగస్ విమానం EI402కు బాంబు బెదిరింపు రావడంతో ఫ్రాన్స్‌లోని ఎవ్రెక్స్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. మరోవైపు, హెల్సింకి నుంచి రోమ్కు వెళ్తున్న ఫిన్నైర్ విమానాన్ని ఇటాలియన్ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు అడ్డగించాయి. అనంతరం అది రోమ్‌లోని ఫియుమిసినో విమానాశ్రయంలో దిగింది. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు.
పలు దేశాల్లో విమానాలకు బెదిరింపులు
బెల్జియంలోని బ్రస్సెల్స్ విమానాశ్రయంలో పోలాండ్‌కు చెందిన లాట్ ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండ్ అయింది. బల్గేరియాలోనూ మూడు విమానాలు అత్యవసరంగా దిగాయి. వీటిలో రెండు సోఫియాలో, మరొకటి ప్లోవ్డివ్లో ల్యాండ్ అయ్యాయి. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌కు వెళ్తున్న నాలుగు విమానాలకు కూడా బెదిరింపులు వచ్చినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇక మిలన్ నుంచి బుకారెస్ట్‌కు వెళ్తున్న విజ్ ఎయిర్ విమానంలోని సుమారు 200 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించారు. బాంబ్ స్క్వాడ్ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసింది.
హైబ్రిడ్ దాడులపై అనుమానాలు
గత రెండు రోజుల క్రితం కూడా కనీసం ఏడు విమానాలు, ఒక క్రూయిజ్ షిప్‌కు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఏ ఘటనలోనూ పేలుడు పదార్థాలు లభించలేదు. ఈ బెదిరింపుల వెనుక ఎవరు ఉన్నారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. రష్యా, ఇరాన్‌లతో సంబంధం ఉన్న హైబ్రిడ్ దాడుల కోణంలోనూ యూరోపియన్ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కొన్ని దేశాల్లో సూపర్ మార్కెట్లు, ఫ్రాన్స్‌లోని బ్లడ్ బ్యాంకుల శీతలీకరణ వ్యవస్థలపై సైబర్ దాడులు జరిగినట్లు వార్తలు రావడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. తక్కువ ఖర్చుతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించి, కీలక వ్యవస్థలకు అంతరాయం కలిగించడమే లక్ష్యంగా ఇటువంటి చర్యలు జరుగుతున్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.




