Train Accident: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ, ఏడుగురు మృతి.. 100 మందికి పైగా గాయాలు
ఈజిప్టులోని కైరో నగరానికి సమీపంలో రెండు రైళ్లు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.
Train Crash
Train Accident: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. కైరో నగరానికి దక్షిణంగా ఉన్న గిజా ప్రావిన్స్‌లో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
ఒకే పట్టాలపై వెళ్తున్న రైళ్లు
రవాణా శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. కైరో నగరానికి సుమారు 52 కిలోమీటర్ల దూరంలోని అల్-అయ్యత్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఫయ్యూమ్ ప్రావిన్స్ వైపు వెళ్తున్న రైలు.. అస్వాన్ ప్రాంతానికి బయలుదేరిన మరో రైలును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రాథమిక విచారణలో గిజా-ఫయ్యూమ్ రైలు.. అదే పట్టాపై నిలిచి ఉన్న కైరో-అస్వాన్ రైలు చివరి బోగీని ఢీకొన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో రైలు సిబ్బందిలో ఒకరు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ప్రమాద స్థలానికి చేరుకున్న స్థానికులు
రైళ్లు ఢీకొన్న వెంటనే భారీ శబ్దం రావడంతో స్థానికులు ప్రమాద స్థలానికి పరుగులు తీశారు. కఫర్ గిర్జా ప్రాంతానికి చెందిన అయ్మాన్ గమాల్ తెలిపిన వివరాల ప్రకారం.. బోగీల శిథిలాల్లో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నించారు. వెంటనే అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. సుమారు 80 మంది క్షతగాత్రులను అంబులెన్సుల్లో సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు ఆయన చెప్పారు. కొన్ని బోగీల్లో ప్రయాణికులు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కష్టంగా మారాయి.
బోగీలో చిక్కుకున్న ప్రయాణికులు మృతి
ప్రమాదం జరిగిన సమయంలో నిలిచిపోయిన రైలులోని ఓ బోగీలో కొందరు ప్రయాణికులు చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసే సమయానికి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసీ స్పందించారు. ప్రమాదానికి కారణాలను వెంటనే గుర్తించాలని, బాధ్యులపై చర్యలు తీసుకునేలా సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు, ప్రధాన అభియోజక కార్యాలయానికి చెందిన అధికారులు కూడా ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు
రైలు సేవల పునరుద్ధరణకు చర్యలు
ప్రమాదం కారణంగా రైల్వే మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలపై పడిన శిథిలాలను తొలగించి, సాధ్యమైనంత త్వరగా సాధారణ రైలు సేవలను పునరుద్ధరించేందుకు అత్యవసర సహాయక బృందాలు, భారీ క్రేన్లను అధికారులు అక్కడికి పంపించారు. ఇదిలా ఉంటే.. ఇదే అల్-అయ్యత్ జిల్లాలో గత సెప్టెంబర్‌లోనూ రెండు సరుకు రవాణా రైళ్లు ఢీకొన్నాయి. ఆ ఘటనలో ఒక రైలు డ్రైవర్, అతని సహాయకుడు గాయపడ్డారు. వరుస ప్రమాదాలతో ఈ ప్రాంత రైల్వే భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.




