Donald Trump: భారత్‌కు భారీ షాక్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్
Donald Trump: అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది.
Donald Trump
Donald Trump: అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. రష్యా, ఇరాన్‌లపై మరింత కఠిన ఆంక్షలు విధించేందుకు రూపొందించిన సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026 బిల్లుపై ట్రంప్ అధికారికంగా సంతకం చేశారు. దీనితో ఈ బిల్లు ఇప్పుడు బలమైన చట్టంగా మారింది. ఈ కొత్త చట్టం ప్రకారం, రష్యా నుంచి చమురు, నేచురల్ గ్యాస్‌ను దిగుమతి చేసుకునే దేశాలపై ఏకంగా వంద శాతం వరకు భారీ టెర్రిఫ్ లేదా దిగుమతి సుంకం విధించే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో భారత్, చైనా వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం పొంచి ఉంది.
ప్రస్తుతం అమెరికా భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 18 శాతం, చైనాపై 34 శాతం వరకు టెర్రిఫ్ వసూలు చేస్తోంది. అయితే వైట్‌హౌస్ ప్రకటన ప్రకారం, కొత్త చట్టం అమల్లోకి వస్తే రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే టాప్-5 దేశాలపై 100 శాతం వరకు టెర్రిఫ్ వేసే అధికారం అమెరికా అధ్యక్షుడికి లభిస్తుంది. ఈ చట్టం ట్రంప్ సంతకం చేసిన 30 రోజుల్లోపు పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. గత ఏడాది కాలంలో రష్యా నుంచి అత్యధికంగా ఆయిల్ కొనుగోలు చేసిన దేశాలపై ఈ నిబంధన ప్రధానంగా ప్రభావం చూపనుంది. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులు మరియు దిగుమతిదారులపై తీవ్రమైన వాణిజ్య భారం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ చట్టంలో కొన్ని దేశాలకు మినహాయింపులు ఇచ్చే వెసులుబాటు కూడా ఉంది. రష్యా నుంచి గ్యాస్ లేదా ఆయిల్ దిగుమతులు గణనీయంగా తక్కువగా ఉన్న దేశాలకు, లేదా వాటిని తగ్గించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న దేశాలకు ట్రంప్ ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించవచ్చు. అయినప్పటికీ, రష్యా ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా దాని శక్తి వనరుల విక్రయాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా ఈ కఠినమైన పావులను కదుపుతోంది. రష్యాకు మద్దతుగా నిలుస్తున్న షాడో ఫ్లీట్ నౌకలు, విదేశీ బీమా సంస్థలు, ఆపరేటర్లను కూడా ఈ చట్టం ద్వారా లక్ష్యంగా చేసుకున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. రష్యాతో భారతదేశానికి చారిత్రాత్మకంగా బలమైన వాణిజ్య, రక్షణ సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ ధరలకు లభించే రష్యా క్రూడ్ ఆయిల్‌ను భారత్ పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు అమెరికా తెచ్చిన ఈ కొత్త 100 శాతం టెర్రిఫ్ చట్టం కారణంగా భారత్ తన ఇంధన దిగుమతి వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తుందా లేదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. మొత్తానికి ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాల వాణిజ్య మార్కెట్లలో పెను కలకలం రేపుతోంది.




