డిజిటల్ హోర్డింగ్స్‌ను హ్యాక్ చేసి.. హైవేలపై పోర్న్ వీడియోల ప్రదర్శన!
Digital Billboards: ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ప్రకటనల బోర్డుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ సైబర్ నేరగాళ్లు సంచలన దాడులకు పాల్పడ్డారు.
డిజిటల్ హోర్డింగ్స్‌ను హ్యాక్ చేసి.. హైవేలపై పోర్న్ వీడియోల ప్రదర్శన!
Digital Billboards: ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ప్రకటనల బోర్డుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ సైబర్ నేరగాళ్లు సంచలన దాడులకు పాల్పడ్డారు. పలు దేశాల్లో రద్దీగా ఉండే హైవేల పక్కన ఏర్పాటు చేసిన భారీ డిజిటల్ హోర్డింగ్స్‌ను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
సాధారణ యాడ్స్ ప్రసారం కావాల్సిన డిజిటల్ తెరలపై అకస్మాత్తుగా అశ్లీల వీడియోలు ప్రత్యక్షం కావడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర విస్మయానికి గురయ్యారు. అక్టోబర్ 29న ఈజిప్ట్, మలేసియాలతో పాటు బ్రెజిల్‌లోనూ ఏకకాలంలో ఈ తరహా సైబర్ దాడులు జరగడం అంతర్జాతీయంగా కలకలం రేపింది.
హైవేలపై అశ్లీల దృశ్యాలు.. ఈజిప్ట్, మలేసియా, బ్రెజిల్లో హ్యాకర్ల వీరంగం
ఈజిప్ట్‌లోని కైరో సమీపంలోని అత్యంత రద్దీగా ఉండే '26 జులై యాక్సిస్' కారిడార్‌లో భారీ డిజిటల్ హోర్డింగ్‌పై అసభ్యకర దృశ్యాలు ప్రసారమయ్యాయి. ప్రయాణికులు వీటిని తమ మొబైల్స్‌లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియోలు వైరల్‌గా మారాయి.
ఆ హోర్డింగ్‌ను నిర్వహిస్తున్న ప్రకటనల సంస్థ వెంటనే అప్రమత్తమై ప్రసారాన్ని నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అచ్చం ఇలాంటి ఘటనే మలేసియాలోని జోహోర్ రాష్ట్రం క్లువాంగ్ పట్టణంలోనూ, బ్రెజిల్‌లోని పియావీ రాష్ట్రం కాంపో మాయోర్ ప్రాంతంలోనూ చోటుచేసుకుంది. ఆయా ప్రాంతాల్లోని ఎల్ఈడీ తెరలపై అభ్యంతరకర దృశ్యాలు ప్రసారం కావడంతో మున్సిపల్ అధికారులు, ప్రకటనల సంస్థలు స్పందించి వెంటనే స్క్రీన్లను నిలిపివేశాయి.
'లీకర్స్' హ్యాకింగ్ బృందం పనే.. బలహీన భద్రతే కారణం
ఈ సైబర్ దాడికి తామే కారణమని 'లీకర్స్' (Leakers) అనే హ్యాకింగ్ గ్రూప్ బహిరంగంగా ప్రకటించింది. డిజిటల్ తెరలకు ప్రకటనల కంటెంట్‌ను పంపించే సాఫ్ట్‌వేర్‌లోని సెక్యూరిటీ లోపాలను ఆసరాగా చేసుకుని ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలిపింది.
ఇంటర్నెట్లో సరైన భద్రత లేని వ్యవస్థలను కేవలం రెండు గంటల్లోనే గుర్తించి హ్యాక్ చేశామని ఆ బృందం వెల్లడించింది. అంతేకాకుండా ఇరాక్, చైనాలోనూ ఇలాంటి దాడులే చేశామని పేర్కొన్నప్పటికీ, ఆ దేశాల నుంచి అధికారిక ధృవీకరణ రాలేదు. ప్రకటనల కంటెంట్‌ను పంపిణీ చేసే ఒక అంతర్జాతీయ సంస్థ వెబ్‌సైట్‌పై జరిగిన సైబర్ దాడి వల్లే ఈ అనధికారిక వీడియోలు పలు దేశాల్లోని తెరలపై ప్రసారమైనట్లు ఈజిప్ట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
డిజిటల్ హోర్డింగ్స్‌ను రిమోట్ ద్వారా నిర్వహించే వ్యవస్థలకు బలమైన పాస్వర్డ్లు, ఎన్క్రిప్షన్, ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్లు వంటి కఠినమైన భద్రతా చర్యలు లేకపోతే భవిష్యత్తులోనూ ఇలాంటి ప్రమాదాలు తప్పవని ఈ ఘటనలు హెచ్చరిస్తున్నాయి.




