Delta Airlines: ఎయిర్‌లైన్స్ సిస్టమ్ డౌన్.. 3,500 విమానాలపై ప్రభావం

Delta Airlines: అమెరికాలో డెల్టా ఎయిర్‌లైన్స్ కంప్యూటర్ సిస్టమ్లో సాంకేతిక లోపం తలెత్తడంతో వేలాది విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి.

CR Reddy
Published on: 23 Nov 2026 9:31 AM IST
Delta Airlines: ఎయిర్‌లైన్స్ సిస్టమ్ డౌన్.. 3,500 విమానాలపై ప్రభావం
X

Delta Airlines: అమెరికాలో డెల్టా ఎయిర్‌లైన్స్ కంప్యూటర్ సిస్టమ్లో సాంకేతిక లోపం తలెత్తడంతో వేలాది విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి.

అమెరికాలో విమాన ప్రయాణికులకు మరోసారి సాంకేతిక సమస్యలు ఇబ్బందులు కలిగించాయి. ప్రముఖ విమానయాన సంస్థ డెల్టా ఎయిర్‌లైన్స్ కంప్యూటర్ వ్యవస్థలో తలెత్తిన లోపం కారణంగా ఆదివారం (నవంబర్ 22) దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. ముఖ్యంగా అట్లాంటా ఎయిర్ పోర్టులో పరిస్థితి గందరగోళంగా మారింది. న్యూయార్క్‌లోని లాగార్డియా సహా ఇతర విమానాశ్రయాలపైనా ప్రభావం కనిపించింది. సుమారు 5,000 విమాన సర్వీసులు షెడ్యూల్‌లో ఉండగా, ఈ సాంకేతిక సమస్య కారణంగా వేలాది విమానాల ప్రయాణ ప్రణాళికలు దెబ్బతిన్నాయి. కొన్ని నివేదికలు 3,500 విమానాలపై ప్రభావం పడినట్లు పేర్కొన్నాయి.

విమానాల బరువు లెక్కించే సిస్టమ్‌లో లోపం

డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాల బరువు, బ్యాలెన్సును లెక్కించే ఆటోమేటెడ్ కంప్యూటర్ సిస్టమ్ లో సమస్య తలెత్తింది. విమానం టేకాఫ్‌కు ముందు ప్రయాణికులు, వారి లగేజీ, ఇంధనం, ఇతర సరుకుల మొత్తం బరువును లెక్కించాలి. అంతేకాదు.. విమానంలో ఈ బరువు ఏ ప్రాంతంలో ఎంత ఉందో కూడా పరిశీలించాలి. అప్పుడే విమానం సరైన సమతుల్యతతో ప్రయాణించగలదు. ఈ లెక్కల్లో తేడా ఉంటే విమానం సురక్షితంగా టేకాఫ్ కావడం, గాల్లో స్థిరంగా ప్రయాణించడం కష్టమవుతుంది. అందుకే ఈ ప్రక్రియను విమానయాన సంస్థలు చాలా కీలకంగా పరిగణిస్తాయి.

కంప్యూటర్ పనిచేయకపోవడంతో చేతితో లెక్కలు

ఆటోమేటెడ్ వ్యవస్థ పనిచేయకపోవడంతో డెల్టా సిబ్బంది ప్రత్యామ్నాయ పద్ధతిని అనుసరించారు. విమానాల బరువు, బరువు పంపిణీకి సంబంధించిన లెక్కలను కంప్యూటర్ సాయంతో కాకుండా చేతితో లెక్కించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టడంతో విమానాల బయలుదేరే సమయాలు మారిపోయాయి. అట్లాంటాలో పరిస్థితి మరింత తీవ్రంగా మారడంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అక్కడికి వచ్చే కొన్ని విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ఆంక్షలు సుమారు గంటపాటు కొనసాగాయి. ఆ తర్వాత గ్రౌండ్ స్టాప్ ఎత్తివేసినా ఆలస్యాలు మాత్రం వెంటనే తగ్గలేదు.

5 వేల విమానాలు షెడ్యూల్

ఆదివారం డెల్టా ఎయిర్‌లైన్స్, దాని ప్రాంతీయ భాగస్వామి డెల్టా కనెక్షన్‌కు చెందిన సుమారు 5,000 విమానాలు నడవాల్సి ఉంది. FlightAware గణాంకాల ప్రకారం, ఆ రోజు నమోదైన విమానాల ఆలస్యాలు, రద్దుల్లో సుమారు 70 శాతం ఈ సాంకేతిక సమస్యతో సంబంధం ఉన్నట్లు డెల్టా తెలిపింది. మిగిలిన వాటిపై ప్రతికూల వాతావరణం, అమెరికా ఈశాన్య ప్రాంతాల్లో విమాన రాకపోకల సమస్యలు ప్రభావం చూపాయి. ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు సంస్థ క్షమాపణలు చెప్పింది. అందుబాటులో ఉన్న తదుపరి విమానాల్లో తిరిగి ప్రయాణ ఏర్పాట్లు చేసింది. అవసరమైన చోట భోజనం, హోటల్ వసతి కల్పించింది. ప్రయాణం రద్దు చేసుకోవాలనుకున్న వారికి టికెట్ డబ్బులు తిరిగి చెల్లించే అవకాశం ఇచ్చింది.

10 రోజుల్లో మరోసారి సాంకేతిక సమస్య

అమెరికాలో ఇటీవల విమానయాన రంగాన్ని వరుస సాంకేతిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. నవంబర్ 13న ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన నెట్‌వర్క్‌లో లోపం తలెత్తింది. దీంతో దేశవ్యాప్తంగా విమాన రాకపోకలపై ప్రభావం పడి, 18 వేలకుపైగా విమానాలు ఆలస్యం కావడం లేదా ఇతర మార్పులకు గురయ్యాయి. తాజాగా డెల్టా ఎయిర్‌లైన్స్‌లో సమస్య రావడంతో ప్రయాణికులు మరోసారి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ రెండు ఘటనలూ వేర్వేరు వ్యవస్థల్లో చోటుచేసుకున్నవే. డెల్టా సమస్యకు FAAకి చెందిన విమాన ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థతో సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. డెల్టా కూడా తన ఆటోమేటెడ్ వ్యవస్థ తిరిగి పనిచేస్తోందని ప్రకటించింది. ఈ ఘటన వెనుక సైబర్ దాడి ఉన్నట్లు ఆధారాలు లేవని సంస్థ వెల్లడించింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.