Sheikh Hasina: షేక్ హసీనా రిటర్న్‌పై భారత్ రెండు కండిషన్లు ? బంగ్లాదేశ్ ఏమందంటే!

షేక్ హసీనా తిరిగి రావడానికి భారత్ రెండు షరతులు పెట్టిందన్న వార్తలను బంగ్లాదేశ్ ప్రభుత్వం ఖండించింది. భారత్ నుంచి అలాంటి అధికారిక ప్రతిపాదన రాలేదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి షమా ఒబైద్ ఇస్లాం తెలిపారు.

CR Reddy
Published on: 17 Nov 2026 6:12 AM IST
Sheikh Hasina
X

Sheikh Hasina

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి స్వదేశానికి రావడం పై మరోసారి చర్చ మొదలైంది. ఆమెను అప్పగించేందుకు భారత్ రెండు షరతులు పెట్టిందంటూ విదేశీ మీడియాలో వచ్చిన వార్తలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పందించింది. భారత్ నుంచి అలాంటి అధికారిక ప్రతిపాదన ఏదీ రాలేదని స్పష్టం చేసింది. ఈ వార్తలు నిజం కాదని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి షమా ఒబైద్ ఇస్లాం వెల్లడించారు. దీంతో హసీనా అప్పగింత వ్యవహారంపై కొత్త చర్చ మొదలైంది.

భారత్ రెండు షరతులు పెట్టిందంటూ ప్రచారం

విదేశీ మీడియాలో వచ్చిన ఓ కథనం ప్రకారం.. షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు తిరిగి పంపించేందుకు భారత్ రెండు షరతులు పెట్టినట్లు ప్రచారం జరిగింది. మొదటిది.. హసీనా గతంలో బంగ్లాదేశ్ సైనిక విమానంలో భారత్‌కు చేరుకున్న నేపథ్యంలో, తిరిగి తీసుకెళ్లే బాధ్యతను కూడా బంగ్లాదేశ్ సైన్యమే తీసుకోవాలన్నది. ఇందుకోసం ఢాకా నుంచి సైనిక విమానాన్ని పంపాలని లేదా సరిహద్దు వద్ద ఆమెను స్వీకరించాలని భారత్ కోరినట్లు కథనంలో పేర్కొన్నారు.

అప్పీల్‌కు అవకాశం ఇవ్వాలన్న రెండో షరతు?

రెండో షరతుగా హసీనాకు మరణశిక్షపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించాలని, జూలై ఉద్యమానికి సంబంధించిన కేసు విచారణను మళ్లీ ప్రారంభించాలని భారత్ కోరినట్లు ఆ కథనం తెలిపింది. అయితే ఈ రెండు అంశాలపై భారత్ తమతో ఎలాంటి అధికారిక చర్చలు జరపలేదని షమా ఒబైద్ స్పష్టం చేశారు. భారత్ నుంచి అధికారికంగా ఏదైనా ప్రతిపాదన వస్తే దానికి తగిన విధంగా స్పందిస్తామని తెలిపారు.

ఒప్పందం ప్రకారమే తీసుకురావాలంటున్న ఢాకా

షేక్ హసీనాను భారత్ నుంచి తిరిగి తీసుకురావాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు కోరింది. ఇరు దేశాల మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం ఆమెను స్వదేశానికి పంపించాలని ఢాకా భావిస్తోంది. ఈ అంశంపై భారత్‌కు పలుమార్లు లేఖలు పంపినట్లు షమా ఒబైద్ వెల్లడించారు. చట్టపరమైన, సాంకేతిక అంశాలను బంగ్లాదేశ్ న్యాయ, హోం శాఖలు పరిశీలిస్తున్నాయని చెప్పారు. హసీనాకు మరణశిక్ష విధించిన నేపథ్యంలో ఈ అప్పగింత వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత్ వైఖరి ఏంటి?

మరోవైపు షేక్ హసీనా అప్పగింతపై భారత్ కూడా తన వైఖరిని వెల్లడించింది. ఇది చట్టపరమైన అంశమని, నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గతంలో స్పష్టం చేశారు. హసీనా 2024లో బంగ్లాదేశ్‌లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత భారత్‌లో ఉంటున్నారు. ఆమెను తిరిగి తీసుకురావాలని బంగ్లాదేశ్ కోరుతుండగా, ఈ వ్యవహారంపై భారత్ ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు. తాజా పరిణామాలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు మరోసారి తెరపైకి వచ్చాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.