Bodybuilder: ముసలోడే కానీ మామూలోడు కాదు.. 90 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటున్న తాత
Bodybuilder: సాధారణంగా చాలా మంది వయసు పెరుగుతున్న కొద్ది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.
Toshisuke Kanazawa
Bodybuilder: సాధారణంగా చాలా మంది వయసు పెరుగుతున్న కొద్ది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. కానీ జపాన్‌కు చెందిన 90 ఏళ్ల తోషిసుకే కనాజావా మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా నిలుస్తున్నారు. ఈ వయసులోనూ నూటికి నూరు శాతం ఫిట్నెస్తో ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల జపాన్‌లో జరిగిన ఓ మాస్టర్ బాడీబిల్డింగ్ పోటీలో ఆయన తన ప్రత్యర్థులను వెనక్కి నెట్టి విజయం సాధించారు. ఇప్పటివరకు తన కెరీర్లో ఏకంగా 19 జాతీయ, అంతర్జాతీయ పతకాలను సాధించి చరిత్ర సృష్టించారు.
కనాజావా ప్రయాణం
1936లో జపాన్‌లోని షిమానే ప్రాంతంలో జన్మించిన కనాజావాకు చిన్నప్పటి నుంచే క్రీడలంటే మక్కువ ఎక్కువ. హైస్కూల్ రోజుల్లోనే ఆయన స్విమ్మింగ్, రెజ్లింగ్‌లో పలు పతకాలు గెలుచుకున్నారు. సుమారు 30 ఏళ్ల వయసు వరకు రెజ్లింగ్ చేసిన ఆయన ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల దానికి దూరమయ్యారు. అయితే తన భార్యను మోటివేట్ చేయడానికి ఏకంగా 50 ఏళ్ల వయసులో మళ్లీ బాడీబిల్డింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడా వెనక్కి తిరిగి చూడకుండా నిరంతరం సాధన చేస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు.
కనాజావా స్ట్రిక్ట్ డైట్, ఫిట్నెస్ రహస్యం
కనాజావా తన శరీరాన్ని ఎలాంటి కృత్రిమ పద్ధతులు లేకుండా పూర్తిగా సహజ సిద్ధంగా కాపాడుకుంటున్నారు. తాను ప్రతిరోజూ క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లి బరువులు ఎత్తుతానని ఆయన చెబుతున్నారు. తన ఆహారపు అలవాట్ల గురించి చెబుతూ.. తాను ఎప్పుడూ మాంసం, చేపలు ముట్టనని, చిన్నతనం నుంచి మద్యం కూడా సేవించలేదని వెల్లడించారు. రోజూ బ్రౌన్ రైస్, నాటో, మిసో సూప్, రెండు ఉడకబెట్టిన గుడ్లు తీసుకుంటారు. అలాగే రోజూ 7 గంటల గాఢమైన నిద్రతో పాటు, కండరాల బలం కోసం ప్రొటీన్ షేక్స్ కూడా తాగుతారు.
వృద్ధులకు ఆదర్శంగా నిలుస్తున్న యోధుడు
ఈ వయసులో చాలామంది మంచం పట్టి విశ్రాంతి తీసుకునే సమయంలో, కనాజావా మాత్రం ఏమాత్రం అలసట లేకుండా జిమ్‌లో చెమటోడ్చుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని మరిన్ని పతకాలు సాధించడమే తన లక్ష్యమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. వయసు కేవలం అంకె మాత్రమేనని, దృఢ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తూ కనాజావా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది యువకులకు, వృద్ధులకు రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు.




