Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం.. భారత్ సహా ఐదు దేశాల్లో వణికిన భూమి

నేపాల్ తూర్పు ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో భారత్‌లోని సిక్కిం, బీహార్, పశ్చిమ బెంగాల్ సహా ఐదు దేశాల్లో భూమి కంపించింది.

CR Reddy
Published on: 24 Nov 2026 9:16 AM IST
Nepal earthquake
X

Nepal earthquake

Earthquake: హిమాలయ దేశం నేపాల్‌లో మంగళవారం (నవంబర్ 24) ఉదయం భూకంపం వచ్చింది. ఉదయం 7.02 గంటల సమయంలో సిక్కిం సరిహద్దులకు దగ్గరగా ఉన్న తూర్పు నేపాల్‌లోని కోసి ప్రావిన్స్ తపేల్‌జంగ్ ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.3గా నమోదైనట్లు యూరోపియన్-మెడిటేరియన్ సీస్మోలాజికల్ సెంటర్(EMSC) వెల్లడించింది. భూకంప కేంద్రం సిక్కింలోని మాంగన్‌కు పశ్చిమ వాయువ్య దిశలో 67 కిలోమీటర్ల దూరంలో, భూగర్భంలో 20 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(NCS) తెలిపింది. గత 30 రోజుల్లో ఈ ప్రాంతంలో నమోదైన 4 ప్రధాన భూకంపాల్లో ఇది ఒకటని జియోషేక్ నెట్‌వర్క్ పేర్కొంది.

సిక్కిం, బీహార్, బెంగాల్‌లో కంపించిన భూమి

ఈ భూకంపం ధాటికి నేపాల్‌తో పాటు భారత్, టిబెట్ (చైనా), భూటాన్, బంగ్లాదేశ్ దేశాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ముఖ్యంగా మన దేశంలోని సిక్కిం, బీహార్, పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురి ప్రాంతాల్లో ప్రకంపనలు రావడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్ రాజధాని ఖాట్మండులోనూ స్వల్ప ప్రకంపనలు నమోదైనట్లు ది ఖాట్మండు పోస్ట్ తెలిపింది. భూకంప కేంద్రానికి 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీహార్‌లోని కతిహార్‌తో పాటు బెగుసరాయ్‌లో ఉదయం 7.05 గంటలకు భూమి కంపించినట్లు స్థానికులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

అసోంలోనూ 2.5 తీవ్రతతో భూకంపం

నేపాల్ భూకంపం కంటే కొన్ని గంటల ముందే ఈశాన్య భారత్‌లోని అసోంలోనూ భూమి కంపించింది. మంగళవారం తెల్లవారుజామున 3.39 గంటలకు అసోంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో భూకంపం సంభవించిందని ఎన్సీఎస్ ప్రకటించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 2.5గా నమోదు కాగా, భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 15 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

నేపాల్‌లోనే భూకంపాలు ఎందుకు

హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉండే నేపాల్‌లో తరచుగా భూకంపాలు రావడానికి భౌగోళిక కారణాలు ఉన్నాయి. భూగర్భంలోని ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్ ఒకదానితో ఒకటి ఢీకొట్టుకునే అత్యంత సున్నితమైన హిమాలయ భూకంప మండలం మధ్యలో నేపాల్ ఉంది. భూమి లోపల పేరుకుపోయిన ఒత్తిడి అకస్మాత్తుగా విడుదల కావడం వల్ల అక్కడ భూకంపాలు వస్తుంటాయి. పైగా ఇక్కడి భూకంపాలు భూ ఉపరితలానికి తక్కువ లోతులో సంభవిస్తాయి కాబట్టి, తీవ్రత మధ్యస్థంగా ఉన్నా నష్టం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది.

2015, 2023 నాటి పెను విషాదాలు

గతంలోనూ నేపాల్‌ను భూకంపాలు తీవ్రంగా దెబ్బతీశాయి. 2023 నవంబర్ 3న జాజర్‌కోట్, రుకుమ్ పశ్చిమ జిల్లాల్లో వచ్చిన 5.7 తీవ్రత భూకంపం వల్ల 153 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. అంతకుముందు 2015 ఏప్రిల్ 25న గూర్ఖా జిల్లాలో 7.8 తీవ్రతతో, మే 12న దోలఖాలో 7.3 తీవ్రతతో వచ్చిన వరుస భూకంపాలు దేశాన్ని కుదిపేశాయి. ఆ మహా విషాదంలో ఏకంగా 9 వేల మందికి పైగా మరణించగా, 35 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఎన్నో ప్రపంచ వారసత్వ కట్టడాలు నేలమట్టమయ్యాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.