Peru Airport: ఎయిర్ పోర్ట్ అధికారులకు షాక్.. సూట్‌కేసుల నిండా వింత పురుగులు
ముగ్గురు విదేశీయుల సూట్‌కేసుల్లో గుంట సాక్సుల మధ్య దాచిన 3 వేల టరంటులా సాలీడులను గుర్తించారు.
Peru Airport: విమానాశ్రయాల్లో బంగారం, డ్రగ్స్, విదేశీ కరెన్సీ అక్రమ రవాణా ఘటనలు తరచూ వెలుగులోకి వస్తుంటాయి. కానీ పెరూలో జరిగిన ఓ ఘటన మాత్రం పోలీసులనే ఆశ్చర్యపరిచింది. ప్రయాణికుల సూట్‌కేసుల్లో బట్టలు ఉంటాయని తనిఖీ చేసిన అధికారులకు వేలాది సజీవ సాలీడులు కనిపించాయి. అవి కూడా సాధారణ సాలీడులు కాదు.. టరాన్టులా! ఏకంగా 3 వేల టరంటులాలను గుంట సాక్సుల్లో దాచిపెట్టి విదేశాలకు తరలించే ప్రయత్నం చేశారు. పెరూలోని లిమా విమానాశ్రయంలో నవంబర్ 3న ఈ ఘటన జరిగింది. ఈ అక్రమ రవాణా వెనుక భారీ వ్యాపారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
సూట్‌కేసులు తెరవగానే షాక్
పెరూ రాజధాని లిమాలోని జార్జ్ చావెజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు విదేశీయులు జర్మనీ వెళ్లే విమానం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. అయితే అడవి జంతువుల అక్రమ రవాణా జరగబోతోందని అధికారులకు ముందుగానే సమాచారం అందింది. దీంతో SERFOR అటవీ, వన్యప్రాణుల విభాగం అధికారులు, పర్యావరణ నేరాల విభాగం పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానంతో ముగ్గురి సూట్‌కేసులను తనిఖీ చేయగా లోపల ఏదో కదులుతున్నట్లు గుర్తించారు. వెంటనే బ్యాగులు తెరిచి చూడగా 15 నుంచి 22 వరకు గుంట సాక్సులు కనిపించాయి. ఒక్కో సాక్సులో చిన్న ప్లాస్టిక్ డబ్బాలు పెట్టి వాటిలో సాలీడులను దాచారు. ఈ దృశ్యం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు.
గుడ్ల నుంచి పెద్ద సాలీడుల వరకు
ఆ సూట్‌కేసుల్లో ఉన్నవి ఒకే రకమైన సాలీడులు కావు. వాటిలో టరంటులా గుడ్లు, చిన్న పిల్లలు, పూర్తిగా పెరిగిన పెద్ద సాలీడులు కూడా ఉన్నాయి. పెరూలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వీటిని సేకరించినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా అమెజాన్ అడవులకు చెందిన భారీ టరాన్టులా కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో ఓ జాతి అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అలాంటి అరుదైన వన్యప్రాణులను అనుమతి లేకుండా పట్టుకోవడం, విక్రయించడం చట్టవిరుద్ధం. సజీవంగా ఉండేలా చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి సాక్సుల్లో దాచడం ద్వారా తనిఖీల నుంచి తప్పించుకోవాలని స్మగ్లర్లు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
ఒక్కో సాలీడు ధర రూ.50 వేలు
అసలు ఇన్ని సాలీడులను ఎందుకు అక్రమంగా తరలిస్తున్నారు? దీనికి ప్రధాన కారణం వాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డిమాండ్. SERFOR అధికారి కోరా సువారెజ్ తెలిపిన వివరాల ప్రకారం, యూరప్‌లో ఒక్కో టరంటులా ధర సుమారు 500 యూరోలు. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.50 వేల వరకు ఉంటుంది. వీటిని పెంపుడు జీవులుగా పెంచుకునే వారు, అరుదైన జాతులను సేకరించే కలెక్టర్లు, పరిశోధకులు కొనుగోలు చేస్తుంటారు. ఈ లెక్కన 3 వేల సాలీడులను ఒక్కొక్కటి 500 యూరోల చొప్పున విక్రయిస్తే మొత్తం విలువ 15 లక్షల యూరోలు అవుతుంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.15 కోట్లకు పైగా విలువైన అక్రమ వ్యాపారం జరిగే అవకాశం ఉంది. ఇది ఒక్కో సాలీడు ధర ఆధారంగా వేసిన అంచనా మాత్రమే.
నిందితులకు ఏడేళ్ల వరకు జైలు
ఈ అక్రమ రవాణా ప్రయత్నంలో ఇద్దరు జర్మనీ పౌరులు, ఒక పోలాండ్ పౌరుడు పట్టుబడ్డారు. ముగ్గురినీ పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. వీరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నారు. పెరూ చట్టాల ప్రకారం నేరం రుజువైతే మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మరోవైపు పట్టుబడిన 3 వేల టరంటులాలను SERFOR అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం వాటికి అవసరమైన సంరక్షణ అందిస్తున్నారు. పరిశీలనలు పూర్తయ్యాక వాటిని తిరిగి సహజ ఆవాసాల్లో విడిచిపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో జపాన్‌లోని టోక్యో హనెడా విమానాశ్రయంలోనూ ఓ 23 ఏళ్ల వ్యక్తి 22 జతల సాక్సుల్లో 200 బల్లులను దాచిపెట్టి తరలిస్తూ పట్టుబడ్డాడు. అంతర్జాతీయంగా వన్యప్రాణుల అక్రమ రవాణా ఏ స్థాయిలో జరుగుతోందో ఈ ఘటనలు తెలియజేస్తున్నాయి.




