Medchal: భారత రాజ్యాంగ పరిరక్షణకు యువత నడుం బిగించాలి: ప్రొ. లక్ష్మీనారాయణ!
Medchal: భారత రాజ్యాంగ పరిరక్షణకు యువత నడుం బిగించాలని విద్యా పరిరక్షణ కమిటీ కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గురువారం ఈసీఐఎల్ సదస్సులో అన్నారు.
Medchal: భారత రాజ్యాంగ పరిరక్షణకు యువత నడుం బిగించాలి: ప్రొ. లక్ష్మీనారాయణ!
Medchal: భారత రాజ్యాంగం కేవలం ఒక చట్టాల పుస్తకం కాదని, శతాబ్దాలుగా సామాజిక వివక్ష, కుల అసమానతలు, అంటరానితనం, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా సాగిన పోరాటాల ఆకాంక్షలకు ప్రతిరూపమని విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ అన్నారు.
అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ లోని నీలం రాజశేఖరరెడ్డి భవన్ లో 77వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా "భారత రాజ్యాంగం - యువత భవిష్యత్తు - ప్రజాస్వామ్య పరిరక్షణ" అనే అంశంపై సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు లక్ష్మీ నారాయణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సదస్సు ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సల్మాన్ బేగ్ అధ్యక్షతన జరిగింది.
అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. రాజ్యాంగ పరిరక్షణ అంశంపై నిర్వహించిన వ్యాస రచన పోటీలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్, విజేతలకు బహుమతులను అందజేశారు.
ఈ సందర్బంగా విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ*. మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, లౌకికవాదం, ప్రజాస్వామ్య విలువలతో కూడిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత మాత్రమే కాకుండా నేటి యువతపై ఉన్న చారిత్రక కర్తవ్యం అన్నారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ ముసాయిదా కమిటీ కృషితో రూపుదిద్దుకున్న రాజ్యాంగం ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవితం, సమాన హక్కులు, న్యాయం కల్పించే మార్గాన్ని చూపిందన్నారు . రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఆచరణలో అందినప్పుడే రాజ్యాంగ లక్ష్యం నెరవేరుతుందని పిలుపునిచ్చారు.
అదే విధంగా ఏఐవైఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరు ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్. మాట్లాడుతూ నేటి దేశంలో రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయన్నారు. రాజ్యాంగంలోని అధికరణాలు 14, 15, 16 సమానత్వం, వివక్షకు వ్యతిరేకంగా రక్షణ, ఉద్యోగాల్లో సమాన అవకాశాలను నిర్దేశిస్తుండగా, అధికరణం 21A విద్యా హక్కుకు భరోసా కల్పిస్తోందన్నారు.
అధికరణం 19 భావప్రకటనా స్వేచ్ఛ, సంఘటితమయ్యే హక్కులకు రాజ్యాంగ రక్షణ కల్పిస్తోందన్నారు . కాబట్టి యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్యా సమస్యలు, సామాజిక వివక్ష వంటి అంశాలను రాజ్యాంగ స్ఫూర్తితో పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు, ఓట్లు మాత్రమే కాదని, ప్రజల హక్కులకు రక్షణ, ప్రభుత్వాలను ప్రశ్నించే స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సామాజిక న్యాయం కల్పించడమే నిజమైన ప్రజాస్వామ్యం అని అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశించిన కులవివక్షలేని సమాజ నిర్మాణం, భగత్‌సింగ్ కలలుగన్న దోపిడీ, అసమానతలు లేని సమాజ స్థాపన దిశగా యువత సంఘటితమై ముందుకు సాగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు గిరిబాబు, సతీష్, నరేష్, రవి, ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి మహేష్ బాబు లతో పాటు వ్యాసరచన పోటీలో పాల్గొన్న విద్యార్థులు, యువత పాల్గొన్నారు.




