Serilingampally: టెలీకాంనగర్లో మహిళలకు కుట్టు శిక్షణ సర్టిఫికెట్ల ప్రదానం!
Serilingampally: గచ్చిబౌలి డివిజన్ టెలీకాంనగర్లోని అక్షయ దాగా స్కిల్ సెంటర్లో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు శుక్రవారం సర్టిఫికెట్లు అందజేశారు.
Serilingampally: టెలీకాంనగర్లో మహిళలకు కుట్టు శిక్షణ సర్టిఫికెట్ల ప్రదానం!
Serilingampally: మహిళా సాధికారత లక్ష్యంగా టెలీకాంనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన 'అక్షయ దాగా స్కిల్ సెంటర్'లో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు శుక్రవారం సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఈ కాలనీలో ‘అక్షయ శక్తి వెల్ఫేర్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో, ‘టెలీకాంనగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ మరియు ‘శ్రీ సత్య సాయి సేవా సన్నిధి’ సహకారంతో ఈ శిక్షణా కేంద్రాన్ని నిర్వహించారు.
గత మూడు నెలలుగా స్థానిక మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఈ శిక్షణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కుట్టు మిషన్ నడపడం, క్లాత్ కటింగ్, బ్లౌజ్ స్టిచింగ్, ఫాల్, పైపింగ్ వంటి ప్రాథమిక అంశాల నుండి మెరుగైన నైపుణ్యాల వరకు శిక్షకులు ఎంతో ఓపికగా నేర్పించారు.శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న మహిళలకు ముఖ్య అతిథిగా హాజరైన శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ‘సర్టిఫికెట్ ఆఫ్ పార్టిసిపేషన్’ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలంటే నైపుణ్యమే అసలైన ఆయుధమని అన్నారు. ఇంటి వద్దనే ఉంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే కుట్టు మిషన్ ద్వారా సొంత ఆదాయాన్ని సంపాదించుకోవచ్చని సూచించారు. ఇలాంటి స్కిల్ సెంటర్లు మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా, వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తాయని పేర్కొన్నారు.
అనంతరం అక్షయ శక్తి వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ.. మహిళలకు కేవలం శిక్షణ ఇవ్వడమే కాకుండా, వారు సొంతంగా ఉపాధి పొందేలా ప్రోత్సహించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. సర్టిఫికెట్లు అందుకున్న మహిళలు తమకు ఉపాధి మార్గం చూపిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు సీను పటేల్, అసోసియేషన్ ప్రతినిధులు, శ్రీ సత్య సాయి సేవా సన్నిధి సభ్యులు మరియు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




