Vikarabad: ఎస్సీ, ఎస్టీ సమస్యలపై కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీక్ష
Vikarabad: వికారాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీక్ష. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలని, అట్రాసిటీ కేసుల్లో వేగంగా న్యాయం చేయాలని ఆదేశం.
Vikarabad: ఎస్సీ, ఎస్టీ సమస్యలపై కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీక్ష
వికారాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి చేరేలా అధికారులు కృషి చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.
బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు, ఆర్వోఆర్ అమలు, బ్యాక్ లాగ్ పోస్టులపై జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, కే.లక్ష్మీ నారాయణలతో కలిసి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల సమస్యల పట్ల మానవతా దృక్పథంతో పని చేయాలన్నారు. ప్రతి ఒక్కరి ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. మున్సిపల్, గ్రామ పంచాయతీలలో అధికంగా ఎస్సీలు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారని వారికి తప్పని సరిగా ఇన్సూరెన్స్ చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆయన తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ ఖాళీల వివరాలను సేకరించి వెంటనే పూరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన వాటాలకు అనుగుణంగా నిధులు ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు.
విదేశీ విద్యను అభ్యసించే వారిని ప్రోత్సహించేందుకు అధికారులు కృషి చేయాలి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపులో కూడా అర్హులను గుర్తించి అందరికీ సహకరించాలని ఆయన సంబంధిత అధికారికి సూచించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కచ్చితంగా ఖర్చు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిధులను ఖర్చు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన అన్నారు.
విబిజి రామ్ జీ పథకం ద్వారా అంగన్వాడీ, మహిళా, గ్రామ పంచాయతీ, పాఠశాల భవనాలతో పాటు పాఠశాల ప్రహారీ నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని డీఆర్డీవో కు సూచించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నమోదైన కేసులను వేగంగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
ప్రతి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, కేసుల విచారణలో జాప్యం జరగకూడదని పోలీస్ అధికారులకు ఆయన సూచించారు.
జిల్లాలో పౌర హక్కుల దినాన్ని తప్పని సరిగా నిర్వహించాలనిఛైర్మెన్ తెలిపారు. పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా పోలీసు, రెవెన్యూ అధికారులతో పాటు డీవీఎంసీ సభ్యులు తప్పని సరిగా హాజరు కావాలని ఆయన సూచించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ ... జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం, ఓవర్సీస్ స్కాలర్షిప్, కులాంతర వివాహాల ప్రోత్సాలకు సంబంధించి వివరాలను వెంటనే అందించాలన్నారు. పౌర హక్కుల దినోత్సవాల నిర్వహించి చట్టాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. నివేదికల ఆధారంగా నష్టపరిహారాలను అందిస్తున్నామని కరెక్ట్ గా తెలిపారు.
ఈ సందర్భంగా ముందుగా కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ చైర్మన్ కు పూల గుచ్చాలతో స్వాగతం పలికారు. సమావేశ అనంతరం చైర్మన్, కమిషన్ సభ్యులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులు శాలువాలతో సత్కరించారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, అదనపు కలెక్టర్ వెంకటాచారి, డీఆర్వో స్వర్ణలత , జడ్పి సీఈవో సుధీర్, డీఆర్డిఓ శ్రీనివాస్, ఆర్డీవోలు వాసుచంద్ర, అనిత, డివిఎంసి సభ్యులు పెండ్యాల అనంతయ్య, గోవింద్ నాయక్, దస్తప్ప, కిరణ్ రోనాల్డ్, మయూర్ వివిధ శాఖల జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.




