Vikarabad: విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంచడమే లక్ష్యం: ఎస్పీ!
Vikarabad: పోలీస్ ఫ్లాగ్ డే-2026 సందర్భంగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు.
Vikarabad: విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంచడమే లక్ష్యం: ఎస్పీ!
వికారాబాద్: పోలీస్ ఫ్లాగ్ డే–2026 కార్యక్రమాల్లో భాగంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ రచనా నైపుణ్యాన్ని, ఆలోచనా శక్తిని, సామాజిక అంశాలపై తమకున్న అవగాహనను వ్యాసాల రూపంలో వ్యక్తపరిచారు.
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం, దేశ రక్షణలో పోలీసుల పాత్రను విద్యార్థులకు తెలియజేయడం, ప్రజల భద్రత కోసం పోలీసులు అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించడం, యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించడం లక్ష్యంగా ఈ వ్యాసరచన పోటీలను నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీస్ అమరవీరుల త్యాగాలు, విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే సవాళ్లు, ప్రజల ప్రాణాలు మరియు ఆస్తుల రక్షణలో పోలీస్ శాఖ పాత్ర, శాంతిభద్రతల పరిరక్షణ, మహిళలు మరియు చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, ప్రజలకు పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు వంటి అంశాలపై వ్యాసాలు రాసేలా ప్రోత్సహించారు.
సమాజంలో శాంతి, భద్రతలను కాపాడటంలో పోలీసుల బాధ్యతలను విద్యార్థులు అర్థం చేసుకునేలా ఈ కార్యక్రమాలు దోహదపడ్డాయి. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని, విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల రక్షణ కోసం పోలీసులు చేస్తున్న సేవలను విద్యార్థులు తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు.
పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో పోలీస్ శాఖ పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందించడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా సామాజిక అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాలని, సమాజంలో జరిగే అన్యాయాలు, నేరాలు, అసాంఘిక కార్యకలాపాల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ముఖ్యంగా యువత సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, మహిళలు మరియు చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రజలు, పోలీసుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలోపేతం కావడానికి విద్యార్థులు కూడా తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.
వ్యాసరచన పోటీల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, రచనా నైపుణ్యం, ఆలోచనా సామర్థ్యం పెంపొందించడంతో పాటు పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాల పట్ల గౌరవభావం పెరుగుతుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో మంచి పౌరులుగా ఎదగాలనే స్ఫూర్తిని నింపుతాయని తెలిపారు.




