Pargi: గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై జడ్జి నాగుల శిల్ప సూచనలు!
Pargi: వికారాబాద్ జిల్లా పరిగి సరస్వతీ శిశు మందిర్‌లో పోక్సో చట్టం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నాగుల శిల్ప విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Pargi: గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై జడ్జి నాగుల శిల్ప సూచనలు!
PARGI: చిన్నారుల భద్రత, బాలల హక్కులు, పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని పరిగి ప్రాథమిక సివిల్ కోర్టు న్యాయమూర్తి నాగుల శిల్ప అన్నారు.వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి నాగుల శిల్ప విద్యార్థులకు చిన్నారుల రక్షణ, గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై పలు కీలక విషయాలను వివరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎవరైనా ఇబ్బందులకు గురిచేసినా, అసభ్యంగా ప్రవర్తించినా భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఐదు ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలని తెలిపారు. మొదటిగా గట్టిగా అరవాలని, వెంటనే ఆ ప్రదేశం నుంచి దూరంగా వెళ్లిపోవాలని, జరిగిన విషయాన్ని స్నేహితులకు, తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు.
అవసరమైతే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని వివరించారు.అలాగే బాలికలు మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. పోక్సో చట్టం కింద సమస్య ఎదురైనప్పుడు ఫిర్యాదు చేయడానికి డబ్బులు అవసరం లేదని, ఆర్థిక స్థోమత లేకపోయినా న్యాయం పొందవచ్చని తెలిపారు.
లీగల్ సర్వీసెస్ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు రాచూరి శ్రీనివాస్ రెడ్డి, ప్రధానాచార్యులు కె. మల్లేష్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ గౌస్ పాషా, పాఠశాల విద్యార్థులు, మాతాజీలు, ఆచార్యులు పాల్గొన్నారు.




