Pargi: వికారాబాద్ జిల్లాలో భూ వివాదం కారణంగా ఇరువర్గాల ఘర్షణ!

Pargi: వికారాబాద్ జిల్లా దోమ మండలం బ్రాహ్మణపల్లిలో స్థల వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ. కర్రలతో పరస్పర దాడులు, కేసు నమోదు చేసిన పోలీసులు.

WAZID, PARIGI
Published on: 30 Oct 2026 6:35 PM IST
Pargi
X

Pargi: వికారాబాద్ జిల్లాలో భూ వివాదం కారణంగా ఇరువర్గాల ఘర్షణ!

Pargi: వికారాబాద్ జిల్లాలో భూ వివాదాలు తరచూ ఘర్షణలకు దారితీస్తున్నాయి చిన్నపాటి స్థల తగాదాలు చివరకు కర్రలతో దాడులు చేసుకునే పరిస్థితులకు చేరుకుంటున్నాయి. తాజాగా దోమ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. తన భూమిలో స్థలం ఇచ్చానని ఒకరు. ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఆక్రమించుకున్నారని మరొకరు. ఇలా మొదలైన వివాదం చివరకు ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది.

వివరాల్లోకి వెళ్తే..బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన అన్వర్‌కు వ్యవసాయ భూమి ఉంది. గతంలో తన ఇంటి ముందు ఉన్న కొంత స్థలాన్ని నరేష్ అనే వ్యక్తికి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇచ్చిన స్థలం కంటే అదనంగా మరికొంత భూమిని నరేష్ ఆక్రమించుకున్నాడంటూ అన్వర్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై కొద్దిరోజులుగా ఇరువర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో మరోసారి ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం కాస్త తీవ్ర ఘర్షణగా మారడంతో ఇరువర్గాలు కర్రలతో పరస్పరం దాడులకు దిగినట్లు సమాచారం.ఈ దాడుల్లో అన్వర్, నరేష్ ఇద్దరికీ తీవ్ర రక్తగాయాలయ్యాయి. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.సమాచారం అందుకున్న దోమ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇరువర్గాల నుంచి వివరాలు సేకరించి, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మొత్తానికి చిన్నపాటి స్థల వివాదం కాస్తా కర్రలతో దాడులు చేసుకునే స్థాయికి చేరడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. భూ వివాదాలను చట్టపరంగా పరిష్కరించుకోవాల్సింది పోయి.. ఇలా దాడులకు దిగితే పరిస్థితులు మరింత విషమించే ప్రమాదం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.పోలీసుల విచారణలో ఈ ఘర్షణకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

WAZID, PARIGI

WAZID, PARIGI