Vikarabad: పాలిటెక్నిక్ విలీన ప్రతిపాదన వెనక్కి తీసుకోవడం హర్షణీయం!
Vikarabad: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్‌ల విలీన ప్రతిపాదన వెనక్కి తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్.
Vikarabad: పాలిటెక్నిక్ విలీన ప్రతిపాదన వెనక్కి తీసుకోవడం హర్షణీయం!
Vikarabad: పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకులు గత 35 రోజులుగా తమ విద్యా భవిష్యత్తు కోసం సాగించిన పోరాటం ఫలించింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేయాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం వెనక్కి తగ్గడం స్వాగతించదగిన పరిణామమని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు పేర్కొన్నారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఇకపై సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగనున్నాయి. అలాగే సాంకేతిక విద్యాశాఖ కమిషనరేట్ (CTE), స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) యథాతథంగా కొనసాగనున్నట్లు స్పష్టత రావడం విద్యార్థులు, అధ్యాపకులకు ఊరట కలిగించే అంశమన్నారు.
డిప్లొమా కోర్సుల నిర్వహణలో ప్రస్తుత విధానంలో మార్పులు లేకుండా కొనసాగించడం, విద్యార్థుల విద్యా భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవడం కీలకమన్నారు. AICTE నిబంధనలు, పరీక్షలు, డిప్లొమా విద్యకు సంబంధించిన ప్రస్తుత అకడమిక్ విధానాలను కొనసాగించాలన్న డిమాండ్లపై స్పష్టత రావడం విద్యార్థుల పోరాటానికి లభించిన ఫలితంగా భావించవచ్చన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని శాంతియుతంగా పోరాడిన పాలిటెక్నిక్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపకులకు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు అభినందనలు తెలిపారు.
అదేవిధంగా, అధ్యాపకులు చేపట్టిన సహాయ నిరాకరణ కార్యక్రమం కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు ఐక్యంగా 35 రోజుల పాటు చేసిన పోరాటం కారణంగానే ప్రభుత్వం పునరాలోచనకు వచ్చింది అని తెలిపారు. విద్యార్థుల విద్యా హక్కులు, భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం స్పష్టమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని డాక్టర్ మెతుకు ఆనంద్ గారు కోరారు.




