Vikarabad: వికారాబాద్‌లో ఘనంగా పద్మనాభ స్వామి బ్రహ్మోత్సవాలు!
Vikarabad: వికారాబాద్ ఆలంపల్లి శ్రీ అనంత పద్మనాభ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. కళ్యాణోత్సవం, పల్లకి సేవ, సాంస్కృతిక ప్రదర్శనలతో పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
Vikarabad: వికారాబాద్‌లో ఘనంగా పద్మనాభ స్వామి బ్రహ్మోత్సవాలు!
వికారాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంతో పాటు ఎంఐజీ కాలనీలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు, స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, స్వామివారి కళ్యాణోత్సవం, అన్నప్రసాద వితరణ, పల్లకి సేవ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించగా, మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం స్వామివారి పల్లకి సేవ అంగరంగ వైభవంగా సాగింది. డప్పు దరువులు, వాయిద్యాలు, భజంత్రీలు, సన్నాయి మేళాల నడుమ స్వామివారిని పల్లకిపై ఊరేగిస్తూ పురవీధుల్లో ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వికారాబాద్ పట్టణ ప్రజలు స్వామివారికి మంగళహారతులతో స్వాగతం పలికారు. పల్లకి సేవను వీక్షిస్తూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.
సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు భరతనాట్యం, కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యాలతో పాటు కోలాట ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక వైభవం కలగలిసిన ఈ బ్రహ్మోత్సవాలు వికారాబాద్ పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి. స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని భక్తులు ప్రార్థించారు.




