Vanasthalipuram: వనస్థలిపురంలో భారీ చోరీ కేసు ఛేదన.. నలుగురు దొంగల అరెస్ట్

Vanasthalipuram: వనస్థలిపురంలో జరిగిన భారీ ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రూ.50 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 14 Nov 2026 4:16 PM IST
Vanasthalipuram
X

Vanasthalipuram: వనస్థలిపురంలో భారీ చోరీ కేసు ఛేదన.. నలుగురు దొంగల అరెస్ట్

వనస్థలిపురం: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. వరుసగా ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి బంగారం, వజ్రాలు, వెండి ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు.

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం పోలీసులు నవంబర్ 14న తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఆటోనగర్‌లోని మోహన్ కాంతా ప్రాంతంలో బైక్‌పై అనుమానాస్పదంగా వెళ్తున్న నిందితులను విశ్వసనీయ సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు.

వనస్థలిపురం ఇంచార్జి ఏసిపి కరుణాకర్ రావు వివరాల ప్రకారం.. నవంబర్ 8న దీపావళి పండుగ సందర్భంగా వనస్థలిపురంలోని సచివాలయ నగర్‌లో నివసించే వికాస్ కుమార్ అగర్వాల్ కుటుంబంతో కలిసి బయటకు వెళ్లారు. తిరిగి రాత్రి 8:30 గంటలకు ఇంటికి వచ్చేసరికి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోని బంగారు ఆభరణాలు, వజ్రాలు, వెండి వస్తువులు, నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు నలుగురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.50 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన వనస్థలిపురం ఇంచార్జ్ ఏసిపి కరుణాకర్ రావు

పోలీసులు అరెస్టు చేసిన నలుగురు నిందితులు:

* గురువల్లి చంద్రశేఖర్ (30)

* సిరిగిడి ప్రకాశ్ (40)

* ఎటబోయిన అరవింద్ (20)

* సంతోళ్ల బాలకృష్ణ (36)

స్వాధీనం చేసుకున్న సొత్తు

* 21 తులాల బంగారు ఆభరణాలు.

* 15 గ్రాముల వజ్రాభరణాలు.

* 54 తులాల వెండి వస్తువులు.

* రూ.9 లక్షల నగదు.

* నేరానికి ఉపయోగించిన ఐదు సెల్‌ఫోన్లు.

* పల్సర్ 150 బైక్.

పోలీసుల ప్రకటన ప్రకారం స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు రూ.50 లక్షలు.

నేరం జరిగిన తీరు

నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆటోనగర్‌లో పనిచేసే ఒక నిందితుడికి పరిచయమున్న వ్యక్తి ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న అనంతరం తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి బంగారం, వజ్రాలు, వెండి ఆభరణాలు, నగదు దొంగిలించారు.

పోలీసు అధికారుల పర్యవేక్షణ

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఐపీఎస్ మార్గదర్శకత్వంలో, ఎల్బీనగర్ డీసీపీ బి. అనురాధ ఐపీఎస్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. వనస్థలిపురం ఏసీపీ, ఇన్‌స్పెక్టర్, క్రైమ్ టీమ్ అధికారులు నిందితుల అరెస్టులో పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR