Vanastalipuram: 36 తులాల బంగారం చోరీ కేసు ఛేదింపు.. ఇద్దరు అరెస్ట్!

Vanastalipuram: వనస్థలిపురం కమలానగర్‌లో ఇంటి తాళం పగులగొట్టి 36 తులాల బంగారం చోరీ చేసిన నిందితుడితో పాటు కొనుగోలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 28 Nov 2026 12:21 PM IST
Vanastalipuram
X

Vanastalipuram: 36 తులాల బంగారం చోరీ కేసు ఛేదింపు.. ఇద్దరు అరెస్ట్!

Vanastalipuram: భారీ ఇంటి దొంగతనం కేసును వనస్థలిపురం పోలీసులు ఛేదించారు. ఇంటి తాళం పగులగొట్టి సుమారు 36 తులాల బంగారం దొంగిలించిన నిందితుడితో పాటు, చోరీ సొత్తును కొనుగోలు చేసిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు రూ.40 లక్షల విలువైన 360 గ్రాముల బంగారం, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

వనస్థలిపురం కమలానగర్‌కు చెందిన రిటైర్డ్‌ ఆర్టీసీ ఉద్యోగి మండలిక సాయి సత్యనారాయణమూర్తి ఈ నెల 22న రాత్రి ఇంటికి తాళం వేసి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఉన్న భార్య వద్దకు వెళ్లారు. మరుసటి రోజు ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉండటంతో పాటు, ఇంట్లోని బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తులో భాగంగా ఈ నెల 26న సాయంత్రం ఆటోనగర్‌ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న బత్తుల రవీందర్‌ను క్రైమ్‌ టీమ్‌ అదుపులోకి తీసుకుంది. విచారణలో ఇంటి దొంగతనానికి పాల్పడినట్లు, చోరీ చేసిన బంగారాన్ని అమ్మేందుకు నేనావత్‌ కృష్ణకు అప్పగించినట్లు వెల్లడైంది. దీంతో బంగారం కొనుగోలు చేసిన కృష్ణను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

స్వాధీనం చేసుకున్న బంగారంలో నెక్లెస్‌లు, గాజులు, పుస్తెలతాడు, గొలుసులు, చెవి కమ్మలు, ఉంగరాలు తదితర ఆభరణాలతో పాటు కరిగించిన బంగారం ముక్కలు ఉన్నాయి. మొత్తం 360 గ్రాముల బంగారాన్ని పోలీసులు రికవరీ చేశారు.

ప్రధాన నిందితుడు రవీందర్‌పై గతంలో వివిధ పోలీస్‌ స్టేషన్లలో 25కు పైగా చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మరో నాలుగు కేసుల్లోనూ అతడి ప్రమేయాన్ని గుర్తించారు. బంగారం కొనుగోలు చేసిన కృష్ణపై కూడా గతంలో కేసులు ఉన్నట్లు వెల్లడించారు.

మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ బి.సుమతి, ఎల్బీనగర్‌ డీసీపీ బి.అనురాధ పర్యవేక్షణలో ఏసీపీ కాశీ రెడ్డి, వనస్థలిపురం SHO రవిబాబు, డీఐ రాజేష్‌, ఎస్‌ఐ రవి, సీసీఎస్‌ ఎల్బీనగర్‌ సిబ్బంది ఈ కేసును ఛేదించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR