Uppal: ఉప్పల్‌లో బాలికపై లైంగిక దాడి: తల్లి సహా ముగ్గురిపై పోక్సో కేసు

Uppal: హైదరాబాద్ ఉప్పల్‌లో బాలికపై లైంగిక దాడి ఘటన కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదుతో తల్లి సహా ముగ్గురిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

KARUNAKAR, UPPAL
Published on: 20 Sept 2026 7:46 PM IST
Uppal
X

Uppal: ఉప్పల్‌లో బాలికపై లైంగిక దాడి: తల్లి సహా ముగ్గురిపై పోక్సో కేసు

ఉప్పల్‌: తల్లితో పరిచయం ఉన్న వ్యక్తి తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని 17 ఏళ్లకు పైబడిన బాలిక ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు తన తల్లి, మరో బంధువు కూడా సహకరించారని ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి తల్లి, ఓ వ్యక్తి, మరో బంధువుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఓ కుటుంబం గత కొన్నేళ్లుగా ఉప్పల్‌లోని ఓ కాలనీలో నివసిస్తోంది. బాధితురాలి తల్లికి మేడిపల్లికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడి, కొంతకాలంగా సన్నిహిత సంబంధం కొనసాగుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో అతడు తరచూ వారి ఇంటికి వచ్చేవాడని తెలిపారు.

సుమారు ఎనిమిది నెలల క్రితం తల్లి సమక్షంలో బాధితురాలిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. అనంతరం పలుమార్లు ఇదే విధంగా వేధింపులకు గురిచేసినట్లు పేర్కొన్నారు. దీంతో బాధితురాలు గర్భం దాల్చినట్లు తెలిపారు. ఆ తర్వాత తల్లి, సదరు వ్యక్తి, మరో బంధువు కలిసి బాధితురాలిని మేడిపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

జూలైలో గర్భస్రావం జరగడంతో ఎనిమిది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు తెలిపారు. అనంతరం బాధితురాలిని బోడుప్పల్‌ ప్రాంతంలోని మరో ఇంటికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. వారం రోజుల క్రితం బాధితురాలు ఉప్పల్‌లోని తన అక్క ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని వెల్లడించడంతో కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది. దీంతో ఆమె కుటుంబ సభ్యుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా తల్లితో సహా ముగ్గురిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL