Uppal: ఉప్పల్ శిల్పారామంలో బతుకమ్మ సంబరాలు.. అలరించిన ‘నవదుర్గ’ నృత్యరూపకం!
Uppal: ఉప్పల్ మినీ శిల్పారామంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళల ఆటపాటలతో పాటు రేణుక ప్రభాకర్ శిష్య బృందం ప్రదర్శించిన ‘నవదుర్గ’ కూచిపూడి నృత్యరూపకం ఆకట్టుకుంది.
Uppal: ఉప్పల్ శిల్పారామంలో బతుకమ్మ సంబరాలు.. అలరించిన ‘నవదుర్గ’ నృత్యరూపకం!
ఉప్పల్: బతుకమ్మ పండుగ రెండో రోజు సందర్భంగా ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు సందడిగా సాగాయి. శిల్పారామం మహిళా సిబ్బంది సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, సాయంత్రం సందర్శకులతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడారు. పూల పండుగ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొనడంతో ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.
అనంతరం మినీ శిల్పారామంలోని యాంఫీ థియేటర్‌లో శ్రీమతి రేణుక ప్రభాకర్ శిష్య బృందం ప్రదర్శించిన ‘నవదుర్గ’ కూచిపూడి నృత్యరూపకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నవరాత్రుల సందర్భంగా పూజలందుకునే తొమ్మిది రూపాల అమ్మవార్ల కథలను నృత్యరూపంలో కళాకారులు అద్భుతంగా ఆవిష్కరించారు. అమ్మవార్ల వేషధారణ, హావభావాలు, నృత్యాభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
కళాకారులు రీతిగా, దేవిక, లోహిత, మాధురి, ప్రణతి, ప్రవల్లిక, భవజ్ఞ తదితరులు తమ నృత్య ప్రదర్శనలతో అలరించారు. సంప్రదాయ బతుకమ్మ వేడుకలతోపాటు శాస్త్రీయ నృత్య ప్రదర్శన సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచింది.




