Uppal: నాగోల్ చిన్నారుల మిస్సింగ్: జల్లెడ పడుతున్న పోలీసులు!

Uppal: నాగోల్‌లో వారం క్రితం అదృశ్యమైన ఇద్దరు చిన్నారుల కోసం సీపీ సుమతి ఆదేశాలతో ఉప్పల్, నాగోల్ పోలీసులు ఉప్పల్ భగాయత్ పరిసరాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

KARUNAKAR, UPPAL
Published on: 6 Nov 2026 9:49 PM IST
Uppal
X

Uppal: నాగోల్ చిన్నారుల మిస్సింగ్: జల్లెడ పడుతున్న పోలీసులు!

ఉప్పల్‌: నాగోల్‌ ప్రాంతంలో ఏడు రోజుల క్రితం అదృశ్యమైన ఇద్దరు చిన్నారుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ సుమతి ఆదేశాల మేరకు ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌, దేవేందర్‌నగర్‌, కేసీఆర్‌ నగర్‌, రామంతాపూర్‌ తదితర ప్రాంతాల్లో భారీ పోలీసు బలగాలతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

చిన్నారుల ఫొటోలను చూపిస్తూ స్థానికులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఉప్పల్‌ సీఐ రామలింగారెడ్డి, నాగోల్‌ సీఐ మక్బుల్‌ జానీ ఆధ్వర్యంలో అనుమానిత ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఈ నెల 31న ఇద్దరు చిన్నారులు అదృశ్యం కావడంతో వారి తల్లిదండ్రులు నాగోల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వారం రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో పోలీస్‌ కమిషనర్‌ సుమతిని కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అనంతరం తల్లితండ్రులతో కలిసి పోలీసులు గాలింపు చర్యలు విస్తృతం చేశారు.

ఈ సందర్భంగా చిన్నారుల తల్లి కన్నీరుమున్నీరవుతూ మాట్లాడుతూ.. పిల్లలు అదృశ్యమై ఏడు రోజులవుతున్నా వారి జాడ తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తొలినాళ్లలో నాగోల్‌ పోలీసులు తగిన శ్రద్ధతో గాలింపు చేపట్టలేదని ఆరోపించారు.

కమిషనర్‌ను కలిసిన తర్వాతే పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. తమ పిల్లలను క్షేమంగా వెతికి తీసుకొస్తే సంతోషంగా దీపావళి పండుగ జరుపుకుంటామని, చిన్నారులను సురక్షితంగా అప్పగించాలని పోలీసు అధికారులను కన్నీటితో వేడుకున్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL