Nacharam: నాచారం చెరువు అభివృద్ధి పనుల పరిశీలన: కాంగ్రెస్ నేతలు!

Nacharam: నాచారం హెచ్‌ఎంటీ నగర్ పెద్ద చెరువును రూ.30 కోట్లతో సుందరీకరిస్తున్న పనులను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

HARISH, TARNAKA
Published on: 9 Nov 2026 6:00 PM IST
Nacharam
X

Nacharam: నాచారం చెరువు అభివృద్ధి పనుల పరిశీలన: కాంగ్రెస్ నేతలు!

నాచారం: హెచ్‌ఎం‌టి నగర్ పెద్ద చెరువును సుందరమైన ఆహ్లాదకరమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సుమారు రూ.30 కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులను హెచ్‌ఎం‌టి నగర్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించిన నాయకులు, అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతుండటంపై హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. హెచ్‌ఎం‌టి నగర్ పెద్ద చెరువు అభివృద్ధికి రూ.30 కోట్ల నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక చొరవ చూపుతున్న కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

హైడ్రా ఏర్పాటు అనంతరం చెరువుల ఆక్రమణల తొలగింపు, ఎఫ్‌టీఎల్ పరిధుల పరిరక్షణతో పాటు చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. చెరువుల పునరుద్ధరణ వల్ల భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని, భావితరాలకు విలువైన నీటి వనరులను కాపాడినట్లవుతుందని అన్నారు.

హెచ్‌ఎం‌టి నగర్ పెద్ద చెరువు అభివృద్ధి పనులు పూర్తయితే ఈ ప్రాంతం ప్రజలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పనుల పురోగతిపై స్థానిక ప్రజలు సైతం సంతోషం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని నాయకులు పేర్కొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA